టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, అందుకోసం నర్సీపట్నంలో అర్దరాత్రి ఆయన ఇంట్లోకి గోడ దూకి దౌర్జన్యంగా ప్రవేశించడంపి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో టిడిపి నేతలు #WeStandWithAyyanna పేరుతో ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ, “రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చింతకాయల అయ్యన్న కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఏదో పేరుతో వేధిస్తూనే ఉంది. ఈ మూడున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం ఆయనపై 10 కేసులు నమోదు చేసింది. ఆయన విషయంలో పోలీసులు, ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై హైకోర్టు తప్పు పట్టిన్నప్పటికీ వారి తీరు మారడం లేదు. పోలీసులే అర్దరాత్రి దొంగల్లా గోడ దూకి అయ్యన్న పాత్రుడు ఇంట్లో జొరబడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలను, దౌర్జన్యాలను చూశామా? ఇవేమి రాక్షస రాజకీయాలు? ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను నిలదీసి అడుగుతున్నందునే ప్రభుత్వం అయ్యన్నపాత్రుడిని ఈవిదంగా వేదిస్తోంది. జగన్ ప్రభుత్వం, పోలీసుల తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు స్పందిస్తూ, “అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎంతటి బలవంతుడైనా ప్రజాబలం ముందు తలవంచాల్సిందే. రేపు ఇదే బీసీలు మీ పాలిట శాపంలా మారి గుణపాఠం నేర్పిస్తారని గుర్తుపెట్టుకోండి,” అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.



