రెండు తెలుగు రాష్ట్రాలకు నారా ‘చంద్ర’బాబు నాయుడు, కల్వకుంట్ల ‘చంద్ర’ శేఖర్ అనే ఇద్దరు చంద్రులు ఉన్నారు. అయితే ఇందులో ఒకరు గెలుపు గౌరవంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పౌర్ణమి చంద్రుడు వలే వెలుగుతుంటే మరొకరు ఓటమి నైరాశ్యంలో తెలంగాణ ప్రతిపక్ష నేతగా అమావాస్య చంద్రుడి వలే చీకటిలో మగ్గుతున్నారు.
ఒక చంద్రుడి వెలుగులు టీడీపీ తో పాటు కూటమి పార్టీల వరకు వ్యాపిస్తే మరో చంద్రుడి చీకట్లు బిఆర్ఎస్ తో పాటు కల్వకుంట కుటుంబాన్ని చుట్టిముట్టాయి. అయితే ఇక్కడ చంద్రబాబు ఓటమిలోను, గెలుపు లోను ప్రజా క్షేత్రంలోనే నిలబడ్డారు, పార్టీని నిలబెట్టారు.
మరి చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన గెలుపులోను ఓటమిలోను ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితం అయ్యారు, పార్టీని ప్రతిపక్షానికి పట్టుకొచ్చారు. ఇక్కడ చంద్రబాబు వైసీపీ వంటి 151 సీట్లు సాధించిన బలమైన రాజకీయ పార్టీని ఎదుర్కొంటు, వారి అవమానాలను, ఆ పార్టీ చేసిన అవహేళలను తట్టుకుంటూ తాను ముందుకెళ్లి తన పార్టీని అధికారం దిశగా తీసుకెళ్లారు.
ఇక ఇక్కడ చంద్ర శేఖర్ సంగతి చూస్తే, పదేళ్ల అధికారంతో తెలంగాణలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేసి చివరికి అదే ప్రతిపక్షానికి పరిమితమై ఫామ్ హౌస్ లో కాలం వెళ్లదీస్తున్నారు. ఒకపక్క పార్టీ ఓటమితో పాటు మరోపక్క కేటీఆర్ – కవిత ల మధ్య మొదలైన పార్టీలో ఆధిపత్య పోరు, కవిత – హరీష్ ల మధ్య రాచుకున్న రాజకీయ చిచ్చుతో అటు కుటుంబ పరంగా కూడా కేసీఆర్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని చీకటి రోజులను, ఎప్పుడు ఎదుర్కోని వ్యక్తిగత విమర్శలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చవిచూశారు, అలాగే ఏనాడూ కంటతడి పెట్టని బాబు నాడు అసెంబ్లీ సాక్షిగా తన అర్ధాంగి భువనేశ్వరికి జరిగిన అవమానానికి తల్లడిల్లారు.
ఒకపక్క వ్యక్తిగత విమర్శలతో వైసీపీ విమర్శనా బాణాలు వేస్తున్నా, కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి లాగి వారి ఆత్మాభిమానం పై రాజకీయం చేసినా, తన పై కేసులు మోపి అరెస్టులు చేసి బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ పైశాచిక ఆనందాన్ని అనుభవించినా,
అలాగే తన వయస్సు పై, తన చావు పై హద్దులు దాటి మాటలు విసిరి తనను మానసికంగా కుంగదీసి తన చుట్టూ అమావాస్య చీకట్లను నింపినా బాబు తన పట్టుదల, నిబ్బరంతో తిరిగి గెలుపు అనే పౌర్ణమి వెలుగులు చూసారు, అలాగే తన పార్టీకి అధికారం అనే కాంతిని పంచారు, ఇంకా తన ప్రత్యర్థి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించారు.
కానీ చంద్రశేఖర్ మాత్రం గెలుపు అనే పౌర్ణమి వెలుగులో ఉండి ఓటమి అనే అమావాస్యను మర్చిపోయి, తనకు తన పార్టీకి తెలంగాణలో అధికారం శాశ్వతం అనే భ్రమలో మిగిలిపోయి చివరికి గ్రహణం పట్టిన చంద్రుడి వలే ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.
ఆ అజ్ఞాత జీవితం ఏ స్థాయికి వెళ్ళింది అంటే చిఎవరికి తన పార్టీ సిట్టింగ్ స్థానం గెలుపు అనేది బిఆర్ఎస్ చావుబతుకుల సమస్య గా మారిన కేసీఆర్ బయటకొచ్చి తన పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం చెయ్యలేని స్థితికి చేరుకున్నారు, అలాగే తన సొంత కుమార్తె తన పార్టీ పై, తన పార్టీ నాయకత్వం పై, తన పార్టీ ముఖ్య నాయకుల పై విమర్శలు ఎక్కుపెట్టినా కనీసం స్పందించలేని దీన స్థితిలో చంద్రశేఖర్ మిగిలిపోయారు.
రోజులో సూర్య చంద్రులు, చీకటి వెలుగులు ఎంత సహజమో రాజకీయాలలో కూడా గెలుపోటములు అంతే సహజం అన్నట్టుగా తీసుకోకపోతే అమావాస్య చీకట్లు మాదిరి కేసీఆర్ రాజకీయం అజ్ఞాత మాయం అవ్వడం ఖాయం. అలాగే ఒకవేళ రెంటిని ఒకేలా చూస్తే చంద్రబాబు మాదిరి అమావాస్య తరువాత వచ్చే పౌర్ణమి వెలుగులను ఆస్వాదిస్తారు.






