సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించేందుకు ఓ పక్క తీవ్రంగా కృషి చేస్తుంటే, మరో పక్క పరిశ్రమల నిర్మాణ పనులను జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కుటుంబ సభ్యులు అడ్డుకొని సిబ్బందిపై దాడికి పాల్పడటం చాలా శోచనీయం.
సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఏపీ సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబి) సమావేశం జరిగింది. దానిలో 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు.
ఆ పది పరిశ్రమలు మొత్తం రూ.85,083 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. వాటి ద్వారా సుమారు 33,966 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటికి ప్రోత్సాహకాలు అందిస్తూ, వాటి స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేసింది. నిన్న జరిగిన ఎస్‌ఐపీబి సమావేశంలో వాటికి ఆమోదముద్ర వేసింది. వాటిలో అదానీ గ్రూప్‌కు చెందిన ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ కూడా ఒకటి.
అది రూ.8,240 కోట్ల పెట్టుబడితో కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద 470 ఎకరాలలో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ నిర్మించబోతోంది. దానిలో ప్రత్యక్షంగా 4,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఆ ప్రాంతంలో అనేక వందల మందికి ఉపాధి లభించనున్నాయి.
ఇప్పటికే దీని నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించి అన్ని అనుమతులు మంజూరు చేయడంతో, ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ సిబ్బంది అక్కడ ఉండేందుకు గాను క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని, మంగళవారం నుంచి భూమి చదును పనులు మొదలుపెట్టారు.
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి మంగళవారం సాయంత్రం తమ అనుచరులను వెంటపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారి అనుచరులు క్యాంప్ కార్యాలయంపై రాళ్ళతో దాడి చేశారు. అక్కడే ఉన్న జేసీబీలపై కూడా రాళ్ళతో దాడి చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సదరు సంస్థని కొన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళడంతో మొన్ననే ఆయనని తన కార్యాలయానికి పిలిపించుకొని మందలించారు కూడా.
ఓ వైపు తాను పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తుంటే వచ్చిన పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెడితే సహించనని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది.
ఇకపై ఆవిదంగా చేయనని సిఎం చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చిన మర్నాడే ఆయన కుటుంబ సభ్యులు ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ సిబ్బంది, కార్యాలయం, వారి వాహనాలపై దాడి చేయడం చాలా తీవ్రమైన విషయమే.
జగన్ హయాంలో వైసీపి నేతలు ఇలాగే రెచ్చిపోయిపారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టడం వలననే ఏపీకి పరిశ్రమలు రాలేదు. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో నేటికీ అటువంటి వాతావరణమే ఉంటే, సిఎం చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అవుతాయి. కనుక ఇటువంటి అరాచకాలను గట్టిగా కట్టడి చేయాల్సి ఉంటుంది.




