ఒంగోలు మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాలకు తెలుగు తమ్ముళ్ళ నుంచి గొప్ప స్పందన వస్తోంది. అందుకు కారణం ఆయన తన పాత వైఖరికి స్వస్తి పలికి సరికొత్త స్టైల్లో ప్రసంగిస్తుండటమే.
గతంలో చంద్రబాబు నాయుడు మైక్ ముందు నిలబడి సుదీర్గంగా ప్రసంగించేవారు. అప్పుడూ ఆయన ముఖ్యమైన విషయాలనే ప్రస్తావించేవారు. కానీ వాటిలో విరుపులు, మెరుపులు పెద్దగా ఉండేవి కావు. దాంతో ఆయన ప్రసంగాలు కాస్త చప్పగా సాగుతున్నట్లు అనిపించేవి.
కానీ గత కొంతకాలంగా ఆయన మైక్ కలిగిన హెడ్ ఫోన్ సెట్ తగిలించుకొని వేదికపై అటూ ఇటూ తిరుగుతూ అందరివైపు చూస్తూ ప్రసంగిస్తుండటంతో, తెలుగు తమ్ముళ్ళు ఆయన తమతోనే నేరుగా మాట్లాడుతున్న అనుభూతి పొందుతూ ఆయన ప్రసంగిస్తున్నంత సేపు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు ప్రసంగించే విధానంలో కూడా చాలా స్పష్టమైన మార్పు కనబడుతోంది. ఇదివరకు సుదీర్గంగా వివిద అంశాలపై ప్రసంగించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు మాట్లాడుతూ మద్యలో తెలుగు తమ్ముళ్ళను కూడా వాటి గురించి పదేపదే ప్రశ్నిస్తూ జవాబులు చెప్పిస్తుండటంతో సభకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆయన తరువాత ఏమి చెప్పబోతారా?అని ఆసక్తిగా ఎదురు చూస్తూ, ఆయన అడిగినపుడు వెంటనే ఉత్సాహంగా బదులిస్తున్నారు.
ఈరోజు మహానాడులో చంద్రబాబు నాయుడు “బాదుడే….బాదుడూ…. బాదుడే….బాదుడూ….” అంటూ సాగదీసి చెపుతున్నప్పుడు తెలుగు తమ్ముళ్ళు కూడా ఆయనతో గొంతు కలిపి “బాదుడే….బాదుడూ…. బాదుడే….బాదుడూ….’ అంటూ ఏకగొంతుతో పలకడంతో సభలో ఓ రకమైన ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడింది.
అలాగే విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ కోతలు తదితర సమస్యల గురించి వివరిస్తున్నప్పుడు కూడా “ఏం తమ్ముళ్ళూ…మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారా లేదా?జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు నచ్చిందా లేదా? ఇంకా ఇటువంటి కష్టాలు కావాలనుకొంటున్నారా లేదా?” అంటూ ప్రశ్నిస్తూ వారి నుంచే సమాధానాలు రాబట్టారు.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఈవిదంగా సభకు వచ్చినవారిని తన ప్రసంగంతో మమేకం చేసేందుకు ప్రయత్నించేవారు. కానీ ఈసారి మహానాడుకు జగన్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నప్పటికీ లక్షలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ళను చూసి ఆయనలో కూడా ఉత్సాహం ఉరకలు వేసింది. ఆయన అంత ఉత్సాహంగా మాట్లాడుతుండటం చూసి తెలుగు తమ్ముళ్ళు, వేదికపై కూర్చొన్న సీనియర్ నేతలు సైతం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికల వరకు ఇదే ఊపు, ఉత్సాహం చూపిస్తే వారిని ఎదుర్కోవడం వైసీపీకి చాలా కష్టమే.



