ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన తొలిరోజు నుంచే తెలుగుదేశం పార్టీ నేతలపై రాజకీయ కక్షసాధింపులు మొదలుపెట్టి నేటికీ వాటిని కొనసాగిస్తూనే ఉంది. తమ ప్రత్యర్ధ రాజకీయపార్టీని అడ్డుతొలగించుకొనేందుకు ఇన్ని ప్రయత్నాలు చేసేబదులు అదే… ఈ నాలుగేళ్ళలో రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ద పెట్టి ఉంటే వైసీపీకి తిరుగే ఉండేదే కాదు. ప్రజలు భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టినా ఈ సువర్ణావకాశాని వైసీపీ సద్వినియోగించుకోలేకపోయింది.
ఉండవల్లిలో కరకట్ట వద్ద చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న ఇంటిని ఏపీ సీఐడీ పోలీసులు జప్తు చేయడాన్ని టిడిపిపై కక్షసాధింపు చర్యలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజధాని అమరావతిలో ఉండటం చాలా అవసరం కనుక లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన ఆ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉంటున్నారు.
అయితే దానికి ఆయన అద్దె చెల్లిస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు విలువ పెరిగేందుకు ఆయన సహకరించినందున లింగమనేని ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చారని, కనుక ఇది క్విడ్-ప్రో కేసుగానే పరిగణిస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వితండవాదం చేశారు.
ఏపీ సీఐడీ పోలీసులు ఆ ఇంటితో సహా లింగమనేని, మాజీ మంత్రి నారాయణతో సహా మొత్తం 14 మంది టిడిపి నేతలకు చెందిన భూములను జప్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించినప్పుడే, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే ఎన్నికలలోగా ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం,” అని అన్నారు. అంటే ఈ కేసులు, జప్తులు అన్నీ రాజకీయకక్షసాధింపులో భాగమే అని స్పష్టం అవుతోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే నాలుగేళ్ళుగా వారిపై కేసులు నమోదు చేసి ఎందుకు చర్యలు తీసుకోలేదు?
వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయమని గట్టిగా నమ్ముతున్నందునే, క్విడ్ ప్రో కేసులలో ఆరితేరిన వైసీపీ, చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై ఆ కేసులు బనాయించి, ఎన్నికలకు ముందు అందరినీ జైలుకి పంపించి ఏకపక్షంగా 175 సీట్లు గెలవాలని కలలుకంటున్నట్లు ఉంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, ఆ పార్టీ నేతల ఆర్ధికమూలాలు దెబ్బ తీసి టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని గత నాలుగేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం వేధింపులతో మొదట్లో టిడిపి ఉక్కిరిబిక్కిరి అయినమాట వాస్తవం. కానీ టిడిపి త్వరగానే తేరుకొని ప్రతి వ్యూహాలు అమలుచేస్తూ మళ్ళీ బలపడి, ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీని కంగు తినిపించింది. అప్పటి నుంచే వైసీపీలో కలవరం, తీవ్ర అభద్రతాభావం మొదలయ్యాయని చెప్పొచ్చు. ఆ భయంతోనే ఈవిదంగా మరిన్ని తప్పటడుగులు వేస్తోందని చెప్పొచ్చు. కానీ ఈ తప్పటడుగులనే తాము మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే గొప్ప వ్యూహాలని వైసీపీ భ్రమలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టిడిపిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కొద్దీ ప్రజలలో టిడిపిపై సానుభూతి, వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంటుందని గ్రహించిన్నట్లు లేదు! వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు.



