తెలంగాణ రాష్ట్రంలో టిడిపి లేదనే చాలామంది అనుకొనేవారు. కానీ సుమారు నాలుగేళ్ళ తర్వాత ఖమ్మంలో చంద్రబాబు నాయుడు బహిరంగసభ నిర్వహిస్తే దానికి జనం పోటెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తెలంగాణలో టిడిపిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశామని భావిస్తున్న కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు ఖమ్మం సభకి వచ్చిన జనాలను చూసి షాక్ అయ్యారు.
ఏపీకి సరిహద్దు జిల్లాగా ఖమ్మం ఉన్నందున అక్కడ ఏపీ ప్రభావం కాస్త ఎక్కువే. కనుక వైఎస్ షర్మిల కూడా తాను పోటీ చేసేందుకు ఖమ్మం జిల్లాలోని పాలేరుని ఎంపిక చేసుకొన్నారు. అయితే ఆమె పార్టీ ఉనికిని తెలంగాణ సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు కూడా గుర్తించడం లేదు కానీ ఖమ్మంలో చంద్రబాబు నాయుడి బహిరంగసభ విజయవంతం అవడంతో షాక్ అయ్యారు.
ఇదివరకు టిడిపిలో ఉండి బిఆర్ఎస్‌లోకి వెళ్ళిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వంటి పలువురు ఆ పార్టీలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నారు. ఈవిషయం ఆయనే స్వయంగా తెలిపారు కూడా. కనుక అటువంటివారే ఖమ్మం బహిరంగసభ విజయవంతం అయ్యేందుకు టిడిపి నేతలకి తెర వెనుక సహాయసహాకారాలు అందజేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవేళ తెలంగాణలో టిడిపి మళ్ళీ బలంగా నిలద్రొక్కుకోగలిగితే బిఆర్ఎస్‌లో ఉన్న పలువురు నేతలు టిడిపిలోకి వచ్చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఖమ్మం సభ గురించి కేసీఆర్ ఎక్కువ ఆందోళన చెందిన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బిజెపి బలపడినప్పటికీ దాని వద్ద 119 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు లేరు. కనుక తెలంగాణ బలపడేందుకు తాము టిడిపికి సహకరిస్తే ఎన్నికల తర్వాత అది ప్రభుత్వ ఏర్పాటుకి తమకి సహకరిస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనుక తెలంగాణలో టిడిపికి బిజెపి సహాయసహకారాలు అందిస్తుందే తప్ప వ్యతిరేకించదని భావించవచ్చు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ అంతఃకలహాలతో తనను తానే నశింపజేసుకొంటోంది. కనుక వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా బిఆర్ఎస్, బిజెపిల మద్యనే ఉంటుంది. ఒకవేళ ఆలోగా తెలంగాణలో టిడిపి తనకి బలమున్న చోట్ల విస్తరించగలిగితే అప్పుడు పోటీ ఈ మూడు పార్టీల మద్య సాగవచ్చు. అదే కనుక జరిగితే తెలంగాణ రాజకీయాలలో టిడిపి మళ్ళీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది.



