ఏపీ మెట్రో… ఈసారి పట్టాలు ఎక్కడం తధ్యం

nara-chandrababu-naidu-vijayawada-metro-train

రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీలో విజయవాడ, విశాఖ నగరాలలో మెట్రో రైల్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. పదేళ్ళయినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

మొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ రెండు ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్దం చేశారు.

ADVERTISEMENT

కానీ ఆయనపై పగ, ద్వేషం, అసూయతో రగిలిపోయే జగన్‌ ఆయన ఈ ప్రతిపాదనలు చేశారనే ఏకైక కారణంతో ఈ ప్రాజెక్టుని అటకెక్కించేశారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట చేసిన పని ఈ నాలుగు నెలల్లోనే ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్దం చేయించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇది ఆయన నిబద్దతకు నిదర్శనంగా భావించవచ్చు.

2024లో పెరిగిన అంచనాల ప్రకారం విజయవాడలో మూడు కారిడర్ల నిర్మాణానికి రూ. 25,130 కోట్లు, విశాఖలో నాలుగు కారిడర్లకి కలిపి రూ.17,232 కోట్లు కలిపి మొత్తం రూ.42,362 కోట్లు నిధులు అవసరమని కేంద్రానికి తెలియజేశారు.

ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 258 ఎకరాల భూసేకరణకు మరో రూ.2,799 కోట్లు అవసరమని దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేశారు.

ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం తప్పకుండా దశలవారీగా నిధులు అందిస్తూ సహకరిస్తుందని చెప్పేందుకు పలు బలమైన కారణాలున్నాయి.

కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ సూచన మేరకే సవరించిన ఈ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.

ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో సిఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో సిఎం చంద్రబాబు నాయుడుకి మంచి సఖ్యత, సత్సంబంధాలు ఉన్నాయి.

మోడీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులున్నారు. టిడిపి నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కూడా ఉన్నారు. కనుక కేంద్రంలో ఏపీకి పూర్తి సానుకూల వాతావరణం ఉందనే భావించవచ్చు.

మోడీ ప్రభుత్వం వరుసగా మూడుసార్లు అధికారంలో కొనసాగుతున్నందున సహజంగానే ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంటుంది. కనుక మళ్ళీ నాలుగోసారి ఎన్నికలలో గెలవాలంటే ఎన్డీయే మిత్రపక్షాలు చాలా కీలకంగా మారతాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు ఒక్క ఏపీలో మాత్రమే బీజేపీ అధికారంలో భాగస్వామిగా ఉంది.

ఈసారి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. ఆ ప్రతిపాదనకు సిఎం చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపడమే కాక వాటికి టిడిపి, జనసేనలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచన కేంద్రానికి ఉంటే ఆలోగానే ఇటువంటి అభివృద్ధి పనులు ఎంతో కొంత పూర్తిచేసి చూపించి ప్రజలను ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. కనుక ఏపీలో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం తప్పకుండా దశలవారీగా నిధులు అందిస్తూ సహకరిస్తుందని ఆశించవచ్చు.

విజయవాడ మెట్రో కారిడార్-1: పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి గన్నవరం వరకు.

విజయవాడ మెట్రో కారిడార్-2: పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు.

విశాఖపట్నం మెట్రో కారిడార్-1: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు.

విశాఖపట్నం మెట్రో కారిడార్-2: గురుద్వార జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు.

విశాఖపట్నం మెట్రో కారిడార్-3: తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ వరకు.

విశాఖపట్నం మెట్రో కారిడార్-4: కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు.

ADVERTISEMENT
Latest Stories