జగన్‌ కోసం పెద్ద పద్మవ్యూహమే సిద్దం చేస్తున్నారుగా!

Chandrababu’s Strategy Reshapes Andhra Pradesh Political Scene

సదస్సులు, ఒప్పందాలు, పెట్టుబడులు… వాటి గురించి మీడియాలో ప్రచారం, ప్రకటనలు అన్నిటినీ పక్కన పెడితే, రాష్ట్ర విభజనతో ఒకసారి, వైసీపీ పాలనతో మరోసారి వరుసగా రెండు పెద్ద ఎదురు దెబ్బలు తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏ ఒక్కరైన వస్తే అదే గొప్ప విషయమని అనుకున్న రోజులున్నాయి.

కానీ రాజకీయ అనుకూలతలు, సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం, సరైన విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు నెలకొని ఉంటే, పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు.

ADVERTISEMENT

కానీ వైసీపీ అధినేత జగన్‌ మళ్ళీ తాను తప్పక అధికారంలోకి వస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు. కనుక వైసీపీ నీడ ఇంకా ఏపీపై ఉంది.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు రాజకీయంగా చిన్న తప్పటడుగు వేసినా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.

కానీ ఈ విషయం ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కనుక ఈసారి మరింత అప్రమత్తంగా ఉంటూ పాలన, రాజకీయాలను బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

పాలనలో బ్యాలన్స్: ఈసారి రాష్ట్రాభివృద్ధితో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ భారీగా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు గట్టిగా కృషి చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి, ప్రజల ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి, పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. అభివృద్ధితో పాటు ఈసారి పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు మొదలు ఎమ్మెల్యేల వరకు ప్రతీ ఒక్కరూ ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.

రాజకీయ బ్యాలన్స్: మూడు పార్టీలతో కూటమి ప్రభుత్వం నడపడం కత్తి మీద సామే. కానీ మూడు పార్టీల మద్య సఖ్యత సాధించడమే కాక వాటి మద్య సంబంధాలు బలపడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వాటి స్నేహం కళ్ళకు కనిపిస్తోంది కూడా.

ఈసారి కేంద్రానికి మరింత దగ్గరవడంతో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి.

పక్కలో బల్లెంలా ఉన్న వైసీపీని ఈసారి విస్మరించకుండా ఎప్పటికప్పుడు దానినీ రాజకీయంగా హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు.

అంతే కాదు… తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నుంచి భవిష్యత్తులో వైసీపీకి సహాయ సహకారాలు లభించకుండా కూడా రాజకీయంగా పావులు కదుపుతూ దానికీ చెక్ పెడుతున్నారు.

మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్‌ కలలు కంటుంటే, రాకుండా అడ్డుకునేందుకు సిఎం చంద్రబాబు నాయుడు పెద్ద పద్మవ్యూహమే సిద్దం చేస్తున్నారు.

ఈ అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రజా సంబంధాలు, రాజకీయాలు, కేసులు, కేంద్రంతో సత్సంబంధాలు అన్నీ దానిలో భాగంగానే చూడవచ్చు.

వీటిని జగన్‌ గమనించారో లేదో తెలీదు కానీ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేవారు మాత్రం నిశితంగా గమనిస్తూనే ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవని వారు గట్టిగా నమ్మబట్టే మళ్ళీ అందరూ ఏపీకి వస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు.

కనుక వైసీపీకి మరోసారి అవకాశం లభించదని చెప్పేందుకు ఈ పెట్టుబడులను కూడా ఓ నిదర్శనంగా భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories