“మెగా” బలాన్ని నిరూపించుకునే ప్రయత్నమా?

pawan kalyan chiranjeeviపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “సర్ధార్ గబ్బర్ సింగ్” సృష్టిస్తున్న రికార్డులకు కొదవలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము దులుపుతున్న ‘సర్ధార్’ ఆడియో వేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సినీ వేడుకలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా విజయవాడ పరిసర ప్రాంతాలు మారుతున్నాయి. ముఖ్యంగా “డిక్టేటర్” ఆడియో వేడుక తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇలాంటి సినీ వేడుకలు నిర్వహించే చర్చలకు దారి తీసింది.

పవర్ స్టార్ తాజా సినిమా ఆడియో వేడుక కూడా అమరావతిలోనే నిర్వహించాలని, ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కాబోతున్నారన్న సమాచారం మెగా అభిమానులను నూతన ఉత్సాహంలో ముంచెత్తుతోంది. అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ ప్రకటించినప్పటికీ పలు మీడియా వర్గాలలో హల్చల్ చేసిన సమాచారం రీత్యా ‘సర్ధార్’ వేడుక ఏపీలోనే జరగనుందన్న సంకేతాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

ఒకే వేదికపై మెగా బ్రదర్స్ హాజరు కాబోతున్నారు అంటే వచ్చే జనసందోహానికి డోకా లేదు. ప్రస్తుతం అమరావతి ప్రాంతం కూడా సువిశాలంగా ఉంది. దీంతో ఎంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడియో వేడుకను నిర్వహించుకోవచ్చు అన్న అంశమే అమరావతిలో ఈ వేడుకను ఏర్పాటు చేయడానికి ఆస్కారమిచ్చిందని టాక్. ముఖ్యంగా ఈ వేడుక ద్వారా ‘మెగా’ బలాన్ని చాటిచెప్పాలనే ప్రయత్నం జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇటీవల కాలంలో ఏ మెగా ఈవెంట్ బహిరంగంగా జరిగిన దాఖలాలు లేవు. దీంతో ‘సర్ధార్’ వేడుక ద్వారా మెగా సత్తా ఏంటో నిరూపించాలని కుటుంబ వర్గీయులు కూడా ఉత్సాహంగా ఉన్నారట. ఈ వేడుక ద్వారా మెగా కుటుంబమంతా ఒక్కటే అని చాటిచెప్పి, పుకార్లకు స్వస్తి పలకాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా నిజమైతే మెగా అభిమానులకు ఇంతకు మించిన సంతోషకరమైన వార్త ఉండదు.

అయితే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ముందు కూడా నందమూరి కుటుంబమంతా హాజరు కాబోతోందని ఇదే రకమైన వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తీరా ఆ ఈవెంట్ కు వచ్చే సరికి నందమూరి కుటుంబంలో ఉన్న విబేధాలకు నిలయంగా నిలిచింది. మరి ఈ “సర్ధార్ గబ్బర్ సింగ్” వేడుక మాత్రం అలా కాకూడదు అంటున్నారు మెగా ఫ్యాన్స్.

ADVERTISEMENT
Latest Stories