జగన్ ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్యనిషేదం అమలు చేస్తామంటూ మద్యం తయారీ, వ్యాపారాలను గుపెట్లో పెట్టుకొని వేలకోట్ల వ్యాపారం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు అలా అబద్దాలు చెప్పలేదు. మద్యపానం, మద్యం వ్యాపారాలు సమాజంలో భాగమైనందున కల్తీ మద్యం స్థానంలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
అలాగే నేతల గుప్పెట్లో ఉన్న మద్యం సిండికేట్లను విడిపించి మద్యం వ్యాపారం చేయగల ఆర్ధిక స్థోమత, ఆసక్తి ఉన్నవారందరికీ అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వేలు పెట్టకుండా కట్టడి చేశారు.
అందువల్లే ఈసారి 3,393 లైసెన్స్ మద్యం దుకాణాలకి చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 24,000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం అర్దరాత్రి గడువు ముగిసే సమయానికి మొత్తం 89,643 దరఖాస్తులు, వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1800 కోట్ల ఆదాయం లభించింది.
అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో నేతలు సిండికేట్ అవడం వలన మద్యం దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు అందరినీ కట్టడి చేయడం వలన ఇంచుమించు పారదర్శకంగానే ఈ ప్రక్రియ జరిగిన్నట్లు భావించవచ్చు.
ప్రభుత్వానికి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజు రూపంలో భారీగా ఆదాయం లభిస్తుంది. మద్యం ద్వారా ప్రభుత్వాలు ఆదాయం ఆశించడం అనైతికమే కానీ అనివార్యంగా మారింది.
ఇసుక, మద్యం, గనులు ఈ మూడింటికీ అధికార పార్టీ నేతలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడే ప్రభుత్వానికి మంచిపేరుతో పాటు వాటి ద్వారా భారీగా ఆదాయం కూడా లభిస్తుంది. కానీ రాజకీయాలలో ఉన్నవారికి కూడా అవే ప్రధాన ఆకర్షణలు కనుక వాటి నుంచి దూరంగా ఉండమని కట్టడి చేస్తే అసంతృప్తి మొదలవుతుంది.
ఇప్పటికే వైసీపి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు చాలా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని అసంతృప్తిరాగాలు వినిపిస్తున్నాయి. కనుక అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సిఎం చంద్రబాబు నాయుడుకి కత్తిమీద సామువంటిదే.
రాష్ట్ర ప్రజలకు ఆయన నాయకత్వం, అనుభవంపై పూర్తి నమ్మకముంది. దానిని వమ్ముకానీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత తమపైనే ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి.




