మళ్ళీ పోటీ చేయడానికి జగన్ టికెట్లు ఇస్తారో లేదో అని ఆందోళనగా ఉన్న వైసీపి నేతలకి కొత్త కష్టాలు రాబోతున్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి బుధవారం నుంచి ‘నిజం గెలవాలి’ యాత్రలు చేయబోతున్నారు. ముందుగా ఆమె బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడు రోజులపాటు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనవరి 5 నుంచి 29 వరకు 25 లోక్‌సభ నియోజకవర్గాలలో 25 బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ముందుగా జనవరి 7న ఆచంట, తిరువురూ, 9న వెంకటగిరి, ఆళ్ళగడ్డ, 10న పెద్దాపురం టెక్కలిలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. వీటి కోసం టిడిపి నేతలు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టారు.
ఇవి కాక జనవరి 4 నుంచి రెండు నెలల పాటు ‘జయహో బీసీ’ పేరుతో టిడిపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
వైసీపిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు, సీట్ల కోసం తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, టిడిపి నేతలు రాష్ట్రాన్ని చుట్టేయడానికి సిద్దం అవుతున్నారు. కనుక వైసీపి నేతలు అధినేతని ప్రసన్నం చేసుకోవడానికి లేదా తమ నియోజకవర్గాలలో టిడిపిని అడ్డుకోవడానికి నోటికి పని చెప్పక తప్పదు.
ఒకవేళ వైఎస్ షర్మిల కూడా ఏపీలో దిగితే ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో వైసీపి ఇంకా ఆలోచించుకొందో లేదో? తెలీదు. కానీ సంక్రాంతి తర్వాత ఆమె కూడా గేమ్ మొదలుపెడతారని తెలుస్తోంది.
ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండటం వలన ఇంకా ‘సైలంట్ మోడ్’లో ఉన్నారు కానీ ఒకసారి బీజేపీ వైఖరి ఏమిటో చెప్పేస్తే వారు వైసీపితో గేమ్స్ మొదలుపెట్టేస్తారు.
ఫిబ్రవరి 15-20 తేదీలలోగా లోక్‌సభ ఎన్నికల గంట మొగుతుందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. కనుక మోడీ, అమిత్ షాలు కూడా ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఏవో నాలుగు మాటలు అనకుండా వెళ్ళరు.
కనుక వైసీపి భాషలోనే చెప్పాలంటే వైసీపికి ‘ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్స్ ఫెస్టివల్’ ఉంటుంది. మరి వైసీపి నేతలు రెడీయేనా?




