రెండు నెలల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడమే కాదు… వేగంగా మారుతున్నాయి కూడా.
నిజానికి ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు బీజేపీకి రాజకీయంగా దూసుకుపోయేందుకు గొప్ప అవకాశం కల్పిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టుపై బీజేపీ అధిష్టానం మౌనం వహిస్తుండటంతో, ఏపీ బీజేపీ కూడా నోరు కట్టేసుకొని కూర్చోవలసివస్తోంది.
కానీ పవన్ కళ్యాణ్ చాలా చురుకుగా స్పందించి చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిసి, టిడిపితో కలిసి ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. ఈ తాజా రాజకీయ పరిణామాలను జనసేనకు అనుకూలంగా మలుచుకొనేందుకు మళ్ళీ వారాహి యాత్రలు చేస్తున్నారు కూడా.
టిడిపితో కలిసి సాగుతామని పవన్ కళ్యాణ్ చెప్పేసినందున జనసేనతో పొత్తు ఉందో లేదో తెలీని పరిస్థితిలో ఏపీ బీజేపీ ఉంది. ఓ రాజకీయ పార్టీకి ఇంతకంటే దయనీయం ఏముంటుంది?
ఏపీ రాజకీయాలలో ఏవిదంగా ముందుకు సాగాలో స్పష్టత లేకపోవడం వలన, దగ్గుబాటి పురందేశ్వరి కన్వీనియంట్‌గా ఉండే మద్యం విక్రయాలు, కల్తీ మద్యం అంశం గురించి మాట్లాడుతున్నారు. నిజానికి మాట్లాడుతున్నారని అనడం కంటే కాలక్షేపం చేస్తున్నారంటే సరిపోతుందేమో?
ఇటువంటి సందిగ్ధ పరిస్థితులలో దగ్గుబాటి పురందేశ్వరి, నారా లోకేష్‌ని వెంటబెట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలవడంతో బీజేపీ అధిష్టానం ఎటువైపు ఉందో, ఏపీ బీజేపీ ఎటువైపు ఉందో? అనే సందేహం కలగడం సహజం. అందుకే విజయసాయి రెడ్డి వంటివారు కూడా ఆమె ఏ గట్టున ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
అయితే బీజేపీ అధిష్టానానికి ఎంపీ లెక్కలే ముఖ్యం తప్ప ఏపీ, ఏపీ బీజేపీ కావనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమనుకొంటే, ఇన్ని రోజులు నిమ్మకు నీరేత్తిన్నట్లు ఉండేదే కాదు. కనుక దగ్గుబాటి పురందేశ్వరి ముందుగా తమ అధిష్టానంతో మాట్లాడి ఏపీ రాజకీయాలలో తమ పార్టీ పాత్ర, పార్టీ వైఖరి ఏమిటని స్పష్టత తెచ్చుకొన్నాకనే పోరాటాలు చేయడం మంచిది. లేకుంటే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.



