సినిమాలంటే జస్ట్ కళాపోషణ కాదు కానీ…

Debate Over High Ticket Prices in Telugu Cinema

సినిమాలలో చిన్నవి, పెద్దవి, పాన్ ఇండియాలు వేరయా అన్నట్లే దేని కష్టాలు దానికి వేరేగా ఉంటాయి. వాటిలో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుంటే తప్పకుండ అప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ ఛార్జీల పెంపు, జీవోలు… వాటన్నిటికీ క్లైమాక్స్‌గా కోర్టు కేసులు ఉండనే ఉంటాయి. ప్రస్తుతం ఓజీకి కూడా కోర్టులో ఈ క్లైమాక్స్ సీన్ నడుస్తోంది.

ఈ సందర్భంగా ఓజీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆసక్తికరమైన వాదన వినిపించారు. రోడ్డు పక్క హోటల్లో రూ.20లకు దొరికే కాఫీ ఫైవ్ స్టార్ హోటల్లో రూ.500 చెల్లించాల్సి వస్తుంది.

ADVERTISEMENT

దిల్జీ త్ మెహందీ షో, అనిరుద్ షోల టికెట్ ఛార్జీలు వేలల్లో ఉంటాయి. వెళ్ళాలనుకునేవారు అన్ని వేలు పెట్టి టికెట్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు. అంత స్థోమత లేనివారు టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటారు తప్ప ఎవరూ అభ్యంతరం చెపుతూ ఇలా కోర్టులో కేసులు వేయరు.

కానీ మేము ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఓ వందో, రెండొందలో పెంచుకుంటే వెంటనే కేసులు వేస్తుంటారు? ఎందుకు? మేమేమీ మా సొంతంగా టికెట్ ఛార్జీలు పెంచుకోవడం లేదు… ప్రభుత్వం అనుమతిస్తేనే పెంచుకున్తున్నాము కదా?

ఒకవేళ అంత ఖర్చు చేయలేమనుకుంటే పది రోజుల తర్వాత సాధారణ టికెట్ ఛార్జీలున్నప్పుడు కూడా ఇదే సినిమా చూసే వెసులుబాటు ఉంది కదా? కానీ ఇంత రాద్ధాంతం దేనికి?అని నిరంజన్ రెడ్డి వాదించారు.

ఆయన వాదనలు సహేతుకంగానే ఉన్నాయి. అలాగే నిర్మాతలు వందల కోట్లు ఖర్చు చేసి తీస్తుంటారు కనుక లాభాలు వచ్చినా రాకపోయినా కనీసం పెట్టుబడి తిరిగి రావాలని ఆరాటపడుతుంటారు. కనుక వారి అభ్యర్ధన సమంజసమే. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే… తమ అభిమాన హీరో సినిమాని వీలైతే ఒక రోజు ముందుగానే లేదా మొదటి రోజే చూసేయాలనే అభిమానుల ఆత్రుతని అర్ధం చేసుకోవచ్చు.

కానీ పెంచిన ఛార్జీలు ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు? హీరోలని దేవుడిలా ఆరాధించే అభిమానుల నుంచే కదా? వారి కోసం ప్రత్యేక షోలు వేస్తున్నప్పుడు టికెట్లో రాయితీ ఇవ్వాలి కానీ ముక్కుపిండి అదనంగా డబ్బు వసూలు చేయడం ఏమి న్యాయం?

ముక్కు పిండించుకోవడానికి అభిమానులకు అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ వారి కష్టార్జితంతో లాభాలు ఆర్జించడం అవసరమా?

నిరంజన్ రెడ్డి చెప్పినట్లు ఈ అదనపు ఛార్జీలు భరించలేక అభిమానులు కూడా మొదట 10 రోజులు సినిమాకి వెళ్ళకపోతే సినిమాల పరిస్థితి ఏమిటి?

అయినా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయిందని బాధపడుతూ టికెట్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రేక్షకులు పది రోజులు థియేటర్లకు రాకుండా చేసుకోవడం దేనికి?

ఒకప్పుడు ఒక్కో హీరో ఏడాదికి కనీసం 5-6 సినిమాలు సూపర్ స్టార్ కృష్ణవంటివారు 15-16 సినిమాలు కూడా చేసేవారు. ఆరోజుల్లో చాలా సినిమాలు 50, 100 రోజులు ఆడేవి.

కానీ ఇప్పుడు పెద్ద హీరోలు 3-4 ఏళ్ళకో సినిమా చేస్తున్నారు. అయినా వారి సినిమాలు నెల రోజులు మించి థియేటర్లలో నిలబడటం లేదు. కనుక మొదటి పడి రోజుల్లోనే లాగేయాలని ఆరాటపడుతున్నారని అర్ధమవుతూనే ఉంది.

కానీ ఎంత పెద్ద హీరోతో ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా థియేటర్లలో కేవలం నెలరోజులే నిలబడుతున్నాయి… ఎందువల్ల?ఎవరు కారణం? సినీ పరిశ్రమా… ప్రేక్షకులా?

ADVERTISEMENT
Latest Stories