ఈ నెల 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ (మొదటి దశ) శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి పశ్చిమ బెంగాల్లో గెలిచి అధికారంలోకి రావాలని, తమిళనాడులో కూడా తన బలం పెంచుకోవాలని బిజేపి చాలా ఆరాటపడుతోంది.
కనుక ఆ రాష్ట్రాల ప్రజలకు ఆగ్రహం కలిగించే ఎటువంటి పనులు చేపట్టకూడదు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లుకి ఆమోదముద్ర వేసేందుకు, కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది.
తమిళనాడు సిఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ముఖ్యంగా తమిళనాడుపై బలవంతంగా హిందీ రుద్దుతున్నారంటూ ద్రవిడ పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లుతో తమిళనాడు (దక్షిణాది రాష్ట్రాలు) గొంతు నొక్కేయాలని బిజేపి ప్రయత్నిస్తోందని స్టాలిన్.. డీఎంకే నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కనుక బిజేపి, దానితో పొత్తు పెట్టుకున్నందుకు అన్నాడీఎంకే కూడా ఎన్నికలలో నష్టపోయే అవకాశం ఉంది.
ఇక పశ్చిమ బెంగాల్లో ప్రజలెన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి బిజేపి అధిష్టానం కుట్రలు చేస్తూనే ఉందని సిఎం మమతా బెనర్జీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె చేతికి బిజేపియే ఈ డీలిమిటేషన్ అస్త్రం అందించినట్లయింది.
ఈ రెండు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలకు సరైన సమయానికి అత్యంత శక్తివంతమైన ఈ డీలిమిటేషన్ అస్త్రం చేతికి అందింది. కనుక దీనినే బిజేపిపై ప్రయోగించి దెబ్బ తీయకుండా ఉంటాయా?అని ఆలోచించి ఉంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాపీగా పార్లమెంట్ సమావేశాలు పెట్టుకొని తాపీగా ఈ బిల్లు పాస్ చేసుకునేది.
కనుక ఈ బిల్లు కోసం ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం రాంగ్ టైమింగ్ అని చెప్పక తప్పదు. ఈ బిల్లుకి బిజేపి ఎంత మూల్యం చెల్లించిందో మే 4న ఫలితాలు వచ్చాక తెలుస్తోంది.




