డీలిమిటేషన్‌ ఎఫెక్ట్: మంత్రి పదవి ఊడుతుందా?

Azharuddin Minister Post

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ ప్రభుత్వం ద్వంద వైఖరిని ఎండగట్టారు కూడా. అవి ఆయన సొంత అభిప్రాయాలే అయినప్పటికీ ఆయన కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కనుక తమ పార్టీ వైఖరికి అనుకూలంగా అలా మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడీ వాదనలు అజారుద్దీన్ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.

అజారుద్దీన్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కారు. కానీ సుమారు ఆర్నెల్ల క్రితం రేవంత్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. ఉభయ సభలలో దేనిలో ఒక దానిలో సభ్యత్వం లేకపోతే ఆర్నేల్లోగా తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆ ఆర్నెల్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

ADVERTISEMENT

ఆయనని, ప్రొఫెసర్ కొందడరామ్‌ ఇద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ఇదివరకే సిఫార్సు చేశారు. కానీ మాజీ గవర్నర్‌ జిష్ణు వర్మ దానికి ఆమోద ముద్ర వేయకుండానే బదిలీపై మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో శివ్‌ ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. అయన బాధ్యతలు చేపట్టి నెలరోజులు పైనే అయ్యింది. కానీ అయన కూడా ఇంతవరకు వారిని నామినేట్ చేయలేదు.

అజారుద్దీన్కి గడువు దగ్గర పడుతోంది కనుక నేడు సిఎం రేవంత్ రెడ్డి లోక్‌ భవన్‌ (రాజ్ భవన్‌)కు వెళ్ళి ఇద్దరినీ నామినేట్ చేయాల్సిందిగా కోరారు.

ఒకవేళ డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే ఈ ఇద్దరినీ ఎమ్మెల్సీలు నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వకపోవచ్చు. అప్పుడు గవర్నర్‌ ఈ ఫైల్‌ని పక్కన పడేస్తారు. అప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఊడుతుంది కానీ అయన తన కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడారని కేంద్రం భావిస్తే గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వొచ్చు. అప్పుడు అజారుద్దీన్‌ మంత్రి పదవిలో ఉంటారు. తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలడం అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories