నియోజకవర్గాల పునర్విభజన అధికార పార్టీలకు కలిస్తోందా.? ప్రతిపక్షాలకు వరంలా మారుతుందా.? అన్న చర్చ దేశ వ్యాప్తంగా ఊపందుకుంది. ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదన తెచ్చినప్పటి నుండి ఈ అంశం మీద భిన్న వాదనలు బయటకొస్తున్నాయి.
డీలిమిటేషన్ ఒక రకంగా అధికార పార్టీలకు వరంలా మారుతుంటే, మరోపక్క ప్రతిపక్షాలకు అధికారం మీద కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఉదాహరణకు ఏపీ విషయాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ డీలిమిటేషన్ తో 263 కి పెరగనున్నాయి.
దీనితో ఇప్పటికి వరకు ఉన్న 175 లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల స్థానంలో ఇప్పుడు కొత్త నియోజకవర్గాలు వచ్చి చేరతాయి. అక్కడ ఉన్న ప్రజా వ్యతిరేకతను కొత్త నియోజకవర్గాలతో అధికార పార్టీ భర్తీ చేసుకునే అవకాశం వస్తుంది.
అలాగే అధికార పార్టీలో ఉంటూ క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల మీద పట్టు ఉన్న సెకండ్ గ్రేడ్ నాయకులకు ఇప్పుడు ప్రమోషన్స్ లభించే అవకాశం వస్తుంది. అలాగే మూడు పార్టీల పొత్తు కారణంగా రాజకీయ త్యాగాలకు సిద్దపడ్డ నేతలకు సైతం ఇప్పుడు తిరిగి రాజకీయ అవకాశం లభిస్తుంది.
దీని ద్వారా పార్టీలో అసమ్మతి స్థాయి తగ్గుతుంది. ఇది ఒకరకంగా అధికార పార్టీకి కలిసొచ్చే అవకాశం. ఇక మరోపక్క ఈ డీలిమిటేషన్ ద్వారా ప్రతిపక్షాలకు కూడా రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న జిల్లాలలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే దానిని తమకు, తమ పార్టీకి అనుకూలంగా మలచుకునే అవకాశం ఆయా పార్టీలకు లభిస్తుంది.
అలాగే పార్టీ ఓటమితో కండువాలు మార్చిన స్థానాలలో అధికార పార్టీ నేతల మాదిరే ప్రతిపక్ష పార్టీలో కూడా ఉన్న కింద స్థాయి నేతలకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టే వైసీపీ లాంటి పార్టీలకు ఈ డీలిమిటేషన్ మరింత ఊపునిస్తుంది.
ఈ విభజనతో అమరావతితో పేరుతో ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది అని చెప్పుకుంటూ మరికొన్ని ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి వైసీపీ రాజకీయంగా లబ్ది పొందేందుకు సిద్దపడే అవకాశం వస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ మావిగన్ పేరుతో ఇప్పటికే ఆ ప్రచారాన్ని తెరమీదకు తెచ్చి ప్రచారం మొదలుపెట్టేసింది కూడా.
పార్టీలో ఆశావహులకు అవకాశాలు లభించే ఛాన్స్ వస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ నియోజకవర్గంలో తమ అధినేతకు తమ బలం ప్రదర్శించేందుకు, తన పట్టు నిలుపుకునేందుకు ప్రాయత్నాలు చేస్తారు. అయితే ఒక్క ఏపీ విషయానికో వస్తే ఈ డీలిమిటేషన్ ప్రతిపక్ష వైసీపీ కంటే కూడా అధికార కూటమికే ఎక్కువ లబ్ది చేకూరవచ్చు.
ఇక 2024 ఎన్నికలలో కూటమి పొత్తుతో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ కి బలమైన నాయకులు, నాయకత్వం ఉన్నప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా వాటిని మిత్ర పక్షాలకు త్యాగం చేసింది. ఇప్పుడు అటువంటి నాయకులందరికీ రాజకీయ భరోసా లభిస్తుంది.
అలాగే ఇటు అమరావతి మీద విద్వేషం వైసీపీ ఇప్పటికే కొన్ని జిల్లాలో తమ పార్టీ ఉనికిని కోల్పోతుంది. గతంలో మూడు రాజధానులు అని ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టి మావిగన్ అంటూ ముందుకెళ్లడంతో ఆ మూడు ప్రాంతాలలో వైసీపీ ఎదురీదాల్సిన పరిస్థితి.
అయితే ఇదంతా కూడా రాజకీయ పార్టీల నేతలకు కేవలం రాజకీయ నిరుద్యోగం తొలగించే ప్రక్రియ కాకుండా రాష్ట్రాల ప్రగతికి, నియోజకవర్గాల అభివృధికి సాయపడిన రోజు ఈ డీలిమిటేషన్ బిల్లుకి అసలైన అర్ధం పరమార్ధం కలిగినట్టు అవుతుంది.లేదంటే అది ప్రజలకు ఆర్థిక భారమే అవుతుంది.




