మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న “ధృవ” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటల టీజర్స్ ను విడుదల చేసి అభిమానుల మెప్పు పొందిన ఈ సినిమా ఆడియో ఈ నెల 9వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆడియో వేడుకకు బదులు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించగా, దానికి వేడుకగా విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు.
అయితే తాజా సమాచారం మేరకు విజయవాడ నుండి ‘ధృవ’ ప్రమోషన్ కార్యక్రమాలు అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడకు బదులుగా వరంగల్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. పాటలు విడుదలైన ఓ పది రోజుల తర్వాత ఈ వేడుకను ఏర్పాటు చేయాలని, అన్నీ అనుకూలమైతే నవంబర్ 20వ తేదీన వరంగల్ లో గ్రాండ్ ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.
తొలుత విజయవాడలో వేడుక అని చెప్పడంతో, కృష్ణాజిల్లాలోని మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏ మెగా వేడుకను విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహించకపోవడంతో మాంచి ఆకలి మీదున్న అభిమానగణానికి పూర్తి విందు భోజనం ఏర్పాటు చేసినట్లేనని ఫ్యాన్స్ భావించారు. అయితే ఆ అవకాశం విజయవాడ మెగా అభిమానులకు దూరం కానుందన్న లేటెస్ట్ సమాచారంతో నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు.



