Peddireddy Ramachandra Reddy

వైసీపిలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఆయనకు సుదీర్ఘమైన పరిపాలన, రాజకీయ అనుభవం ఉంది. ఆయన అవినీతి అక్రమాల చిట్టాలను పక్కనపెట్టి చూస్తే ఆయన అనుభవం ముందు జగన్‌ దిగదుడుపే. అంత సీనియర్ నాయకుడికి పీఏసీ ఛైర్మన్‌ పదవి చాలా చిన్నదే. కానీ జగన్‌ ఆయనకు ఏదో ఫేవర్ చేస్తున్నట్లు ఆయన చేత నామినేషన్ వేయించారు.

“అయితే ఆయన చేత నామినేషన్ వేయించినప్పుడు, జగన్‌, వైసీపి ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చి ఓటింగులో పాల్గొని ఆయనకు మద్దతు ఇవ్వాలి కదా? కానీ ఎందుకు రాలేదు? ఇది మీ పార్టీ సీనియర్ నాయకుడుని మీరే అవమానించడం కాదా?” అని మంత్రి నారా లోకేష్‌ మండలిలో ప్రశ్నించారు.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

ఇది వాస్తవమే అని అర్దమవుతోంది. వైసీపికి 18 మంది ఎమ్మెల్యేలు లేరు కనుక జగన్‌ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పీఏసీ సభ్యుడుగా గెలిపించుకోలేకపోవచ్చు. కానీ శాసనసభకు వచ్చి ఆయనకు అండగా నిలబడితే ఇద్దరికీ గౌరవంగా ఉండేది. కానీ ఇటువంటి సమయంలో కూడా జగన్‌ శాసనసభకు రాకుండా పారిపోయారు.

పైగా నామి నేషన్ వేయించిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతే ఎన్నిక ప్రక్రియని బహిష్కరిస్తున్నామని చెప్పించారు. దీనిని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవమానంగా భావించారో లేదో తెలీదు కానీ ఆయనకు అవమానం జరిగిందని టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల సభ్యులు భావిస్తుండటం విశేషం.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

అయినా జగన్‌ని నమ్ముకొన్నప్పుడు ఇటువంటి అవమానాలకు, అవసరమైతే జైలుకి పోయేందుకు అందరూ సిద్దంగా ఉండాల్సిందే. కానీ వాటిని తట్టుకోలేక భయపడేవారు పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డిలా దణ్ణం పెట్టి వేడుకుంటూ వీడియో మెసేజులు పెట్టి రాజకీయాల నుంచి తప్పుకోవలసిందే.

అయినా జగన్‌ సహవాసంలో అంటుకున్న రాజకీయ మురికి, బురద కడుక్కోక తప్పడం లేదు. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి, వర్మ కడుక్కుంటున్నారు బహుశః రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంతు రావచ్చు. ఆలోగా జగన్‌తో ఇలా సర్ధుకుపోవలసిందే. జగన్‌తో జర్నీ అంటే పులి మీద సవారీ చేయడమే అని ఇప్పుడు వైసీపిలో అందరికీ అర్దమయ్యే ఉంటుంది.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?