రాజకీయాలలో విలువలు, హుందాతనం, మాట్లాడే భాష నానాటికి దిగజారిపోతున్నాయి. ఒకరిని చూసి మరొకరు, వాళ్ళు మాట్లాడితే తప్పు కానిది మేము మాట్లాడితే తప్పేలా అవుతుంది అంటూ ఒకరు, ఇలా మాట్లాడడమే మా పార్టీ సిద్ధాంతం అన్నట్టుగా మరొకరు తమ వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారు.
అయితే ఈ భాషా సంస్కృతికి ఛీడ పట్టించిన పితామహుడు మాత్రం వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి అనే చెప్పాలి. జగన్ రాజకీయ అరంగేట్రంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు దేశం నలుదిక్కులా మారుమోగింది. తండ్రి పదవి అడ్డుపెట్టుకుని లక్షల కోట్లకు అధిపతి అయిన ఏకైక పొలిటికల్ లీడర్ గా జగన్ పేరు గూగుల్ లో కూడా చిరస్థాయిగా మిగిలింది.
అలాగే వైసీపీ తో జగన్ ప్రారంభించింది ఒక రాజకీయ పార్టీ అని ఆనాడు అందరు భావించినప్పటికీ అది సమాజ విధ్వంసానికి దారి తీసే ఒక ఉన్మాద సంస్థ అని ఇప్పుడు బయటకొస్తుంది. ముఖ్యంగా రాజకీయాలకు బూతుల సంస్కృతిని పరిచయం చేసిన ఘనుడు, ప్రత్యర్థి వ్యక్తిగత జీవితంతో రాజకీయం నడిపిన దిట్ట, బూతు సినిమాలకంటే దారుణమైన పోస్టులతో ప్రత్యర్థి నేతలను సోషల్ మీడియాలో కించపరిచిన కీచకుడు జగన్ మోహన్ రెడ్డి అనేది సాక్ష్యాలతో రుజువుతుంది.
తన రాజకీయ ప్రత్యర్థిని కనీసం పేరు పెట్టి కూడా పిలవలేని కుసంస్కారి జగన్ ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదర్శంగా తీసుకున్నారా అనేలా కేటీఆర్ వ్యాఖ్యలు రోజురోజుకి రాజకీయ విలువలను దిగజారుస్తున్నాయి. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి.
ముఖ్యమంత్రిని ఉద్దేశించి మీరు చేస్తున్న వ్యాఖ్యలు సహేతుకమైనవేనా అంటూ సదరు విలేకరి కేటీఆర్ ను ప్రశ్నించగా అందుకు కేటీఆర్ స్పందిస్తూ కేసీఆర్ లాంటి తెలంగాణ పితామహుడిని ఉద్దేశించి సీఎం నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే, నేను ఇట్లనే హౌలా అంటా, బేకరుగాడంటా, చెత్త వెదవ అంటా, చిట్టి నాయుడు అంటా బారాబర్ అంటా, ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కేటీఆర్.
ఏపీ రాజకీయాలలో ఇటువంటి భాష ప్రయోగాలతోనే వైసీపీ 151 నుంచి 11 కి పడింది. ఇటువంటి సంసృతిని ప్రజలు తిరస్కరిస్తారు, ఇది సమాజం ఆమోదించదగ్గ విధానం కాదు అని ఏపీ ప్రజానీకం 2024 ఎన్నికలలో రుజువు చేసినప్పటికీ ఇప్పుడు ఇదే పంధాలో తెలంగాణలో రాజకీయం చేయాలనీ చూస్తున్న కేటీఆర్ భాషను తెలంగాణ సమాజం హర్షిస్తుందా.?
అక్కడ రేవంత్ కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తానూ ఇలానే బదులిస్తా అంటూ కేటీఆర్ ముందుకెళితే వైసీపీ కి వచ్చిన పరిస్థితే బిఆర్ఎస్ కు వస్తే, జగన్ కు పట్టిన గతే కేటీఆర్ కు పడితే దాని వల్ల నష్టపోయేదెవరు.? వైసీపీ నేతలు బూతులతో టీడీపీ, జనసేన అధినేతలను ఎంతగా రెచ్చకొట్టినా వారు సంయమనం కోల్పోకుండా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ సమాజం హర్షించే భాషతోనే సమాధానం చెప్పారు.
గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దత్త పుత్రుడు అని సంబోధించిన జగన్ ను కేటీఆర్ ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి ని చిట్టి నాయుడిగా సంభోదింస్తున్నారా.? తమ తోటి రాజకీయ ప్రత్యర్థిని పేరు పెట్టి కూడా పిలవలేనంతగా రాజకీయ విలువలు పతనమవుతున్నాయా.? నాడు దత్త పుత్రుడు అంటూ ఒకే మాటతో అటు చంద్రబాబుకి ఇటు పవన్ కు కౌంటర్ వేసాను అని ఆనందించిన జగన్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాకూడా లేకుండా రోధిస్తున్నారు.
అలాగే చిట్టి నాయుడు అంటూ రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఏ నాయుడిని ఉద్దేశించి కౌంటర్ వేస్తున్నారో తెలుసుకోలేనంతా అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. హేళన చేయడం, మాటలతో కించపరచడం ఎవరికైనా కొంత కాలం తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వొచ్చుగాక, కానీ అది ఎప్పటికైనా తిరస్కరించే లక్షణానే కలిగి ఉంటుంది అనేది గ్రహించాలి.




