ఇండియాలోనే నెంబర్ 1షోగా అవతరించిన బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ వెనుక అనేక మంది కృషి ఉండగా, అందులో కంటెంట్ రైటర్ గా బీవీఎస్ రవి అత్యంత కీలక పాత్ర పోషించారు. సీజన్ 1 ముగుస్తున్న నేపథ్యంలో, ఈ షో సక్సెస్ విశేషాలను పంచుకుంటూ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
రొటీన్ ప్రశ్నలను అడగడానికి బాలయ్య ఎందుకని, ఇతర షోలతో సంబంధం లేకుండా ఉండేలా ఈ షోను డిజైన్ చేశామని, ముందుగా ప్రేక్షకుల మనస్సులో ఉన్న ప్రశ్నలకు జవాబు రాబట్టడం అనేది షో సక్సెస్ కు కీలకమని, అది విజయవంతంగా జరిగింది కాబట్టే ఈ షో నెంబర్ 1షో గా మారిందని అన్నారు.
ఉదాహరణకు రానా హెల్త్ టాపిక్ పై అసలు బాలకృష్ణ గారు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ అంశంపై రకరకాల చర్చలు జరిగాయి, గూగుల్ లో కొడితే బోలెడంత సమాచారం ఉంటుంది, గనుక అలాంటి టాపిక్స్ ను బాలకృష్ణ టచ్ చేయలేదని తెలిపారు.
బాలకృష్ణకు రవితేజకు గొడవ జరిగిందన్న అంశం చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఆ ప్రశ్నను క్లియర్ చేస్తూనే షోను ప్రారంభించారు. ఆడియన్స్ పల్స్ ని పట్టుకోగలిగాము గనుకనే షో సక్సెస్ అయ్యింది, సీజన్ 2లో కూడా బాలకృష్ణ గారే చేయాలని తాను భావిస్తున్నానని అన్నారు.
వేయదలచుకున్న ప్రశ్నలను కొన్ని రకాలుగా విభజించామని, బాలకృష్ణ గారు స్వయంగా కొన్ని అడుగుతారని, ప్రేక్షకుల మదిలో ఉన్న మరికొన్ని ప్రశ్నలను మరియు తాను ఇంకొన్ని ప్రశ్నలను రాసానని వివరించారు. చిరంజీవి గారిని పిలిచి మీ అసలు పేరేంటి? అంటే ఎలా ఉంటుంది? అలాంటి రొటీన్ ప్రశ్నలు కాకుండా భిన్నంగా ఈ షోను డిజైన్ చేశామని అన్నారు.



