ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేను ఎంపిక చేయగా, తాజాగా సినిమాటోగ్రాఫర్ ను కూడా బాలీవుడ్ నుండే దించుతున్నారు.
డాన్, తలాష్, రాయిస్ వంటి టాప్ సినిమాలకు ఫోటోగ్రఫీ బాధ్యతలను అందించిన కే.యు.మోహనన్ ను తమ సినిమాకు ఎంపిక చేసినట్లుగా దిల్ రాజు సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. వీరందరి కలయికతో మహేష్ బాబు 25వ సినిమా బడ్జెట్ భారీ రేంజ్ లో ఉండబోతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ టాప్ సాంకేతిక నిపుణులకు తోడు ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరగనుందన్న సమాచారంతో, ‘బాహుబలి’ తర్వాత అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే చిత్రంగా నిలుస్తుందన్న టాక్ ఉంది.



