దీపావళి పండుగ సంబరాలు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి ఒకటి దీపాలు రెండు టపాసులు. అయితే ఈ రెండు కూడా వెలుగుని పంచేవే. కానీ దీపాల వెలుగు పారె సెలయేరు మాదిరి ప్రశాంతంగా ఉంటే టపాసుల కాంతి పరవళ్లు తొక్కుతున్న సముద్ర కెరటాల మాదిరి అలజడిగా ఉంటుంది.
అయితే ఈ టపాసులు పరిమితిలో వాడుకుంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరికి ఆనందాన్ని పంచుతుంటాయి. అలాకాకుండా అవి కూడా మోతాదుకు మించి వినియోగిస్తే చూసే వారికే కాదు అవి కాల్చే వారికి కూడా హానికరమే.
ఈ టపాసుల మాదిరే రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు కూడా తమ రాజకీయానికి ఒక పరిమితి పెట్టుకుంటే అవి చూసే ప్రజలకు చేసే నాయకులకు కూడా ప్రయోజనం ఉంటుంది. అంతే కానీ ఆ రాజకీయం మోతాదుకు మించితే అటు ప్రజలకు హానికరమే ఇటు ఆయా పార్టీల నేతలకు నిష్ప్రయోజనమే అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదమే.
ఉదాహరణకు వైసీపీ విషయానికొస్తే.., ఈ పార్టీ రాజకీయాన్నీ చూస్తే ఇందులో పార్టీ అధినేత నుంచి క్యాడర్ వరకు అందరు ప్రతి విషయాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తారు. చావుల దగ్గర నుంచి ప్రకృతి విపత్తుల వరకు వీరికి ప్రతిదీ రాజకీయమే.
తండ్రి మరణం నుంచి బాబాయ్ దారుణ హత్య వరకు, గులకరాయి నుండి కోడికత్తి వరకు, పరామర్శ నుంచి పాదయాత్ర వరకు, కుటుంబ బంధాల నుంచి నాయకుల మధ్య ఉండే అనుబంధాల వరకు వైసీపీ లో ప్రతిదీ రాజకీయమే.
ఇలా వైసీపీ చేసిన మితిమీరిన రాజకీయమే వైసీపీ ని ఈ పరిస్థితికి తెచ్చింది. రాష్ట్ర రాజధాని మొదలు ప్రత్యర్థి పార్టీల పొత్తు వరకు అన్ని వైసీపీ కి అనుకూలంగా ఉండాలి అనే ఆలోచనే ఆ పార్టీని ప్రతిపక్షానికి కూడా దూరం చేసింది. ఒక్క ఛాన్స్…ఒక్క ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ పాలనలో తనదైన ముద్ర వేసిన ఈ వైసీపీ లక్ష్మీ బాంబ్ మాదిరి ఒక్కసారిగా టప్పున పేలి వెంటనే తుస్సు మంది.
ఇక కూటమి విషయానికొస్తే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి కాస్తంత సమయం పట్టినా ఒక్క సారి కుదిరిన తరువాత మాత్రం మదాబు మాదిరి చివరి వరకు వెలుగును విరజుమ్ముతుంది. అలాగే వీరి రాజకీయం పూర్తిగా పరిమితికి లోబడి ఉంటుంది.
ఈ పార్టీల రాజకీయంలో వ్యక్తిగత విమర్శలకు తావుండదు, అలాగే మహిళల ఆత్మాభిమానానికి కొదవుండదు. ఇక తెలంగాణలో బిఆర్ఎస్ విషయానికొస్తే.., బిఆర్ఎస్ రాజకీయం నిశ్శబ్దంలో తాండవిస్తుంది. దీవాలికి చిన్న పిల్లలు కాల్చే పాము బిళ్ళలు పొగ తప్ప ఎటువంటి హడావుడి ఉండదు. అలాగే బిఆర్ఎస్ రాజకీయం లో కూడా నిశ్శబ్దం తప్ప మరొకటి కనిపించడం లేదు.
పదేళ్ల నిరీక్షణ తరువాత అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ తాటాకు బాంబ్ మాదిరి ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు తుస్సుమంటుందో అర్ధం కాకుండా ఉంటుంది. ఇక బీజేపీ రాజకీయం రాజీ పడుతూ పేలనా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న టపాసు మాదిరి ఆలోచనలోనే కాలం వెళ్లదీస్తుంది.






