పవన్‌ కళ్యాణ్‌కి ఇంకా పెద్ద లక్ష్యాలున్నాయా?

pawan-kalyan-janasena-bigger-goals

వీలైతే ఏపీకి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న పవన్‌ కళ్యాణ్‌, ఎమ్మెల్యే సీట్ల నిష్పత్తి ప్రకారం ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకున్నా, భవిష్యత్‌లో పెద్ద లక్ష్యాలే ఉన్నాయని అప్పుడప్పుడు బయటపడుతుంటారు. తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతుండటం, పార్టీకి అనుబందంగా ‘నరసింహ వారాహి గణం’ ఏర్పాటు చేసుకోవడం వంటివి ఇందుకు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

తాజాగా హోంమంత్రి అనితా వంగలపూడిపై బహిరంగంగా విరుచుకుపడటం ద్వారా సంకీర్ణ ప్రభుత్వంలో జనసేనని తక్కువ అంచనా వేయొద్దని పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా నొక్కిచెప్పిన్నట్లు భావించవచ్చు. బహుశః హోంమంత్రి పదవి ఆశిస్తున్నారేమో కూడా?

ఒకవేళ హోంమంత్రి విషయంలో అసంతృప్తిగా ఉండి ఉంటే అదే విషయం పవన్‌ కళ్యాణ్‌ నేరుగా ఆమెకో లేదా సిఎం చంద్రబాబు నాయుడుకో చెప్పి ఉంటే వేరేలా ఉండేది. కానీ ఉప ముఖ్యమంత్రి తమ హోంమంత్రి పనితీరుని బహిరంగంగా తప్పు పట్టడమే ఇటువంటి అనుమానాలకు, అపోహలకు అవకాశం కల్పిస్తోంది.

టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 5 నెలలు పూర్తి కాలేదు. కనుక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, అమరావతి, పోలవరం, రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల గురించి సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న ఈ తరుణంలో, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తమ ప్రభుత్వంపై తానే విమర్శలు చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది. కూటమిలో అంతర్గతంగా తీవ్ర విభేధాలు ఉన్నాయని ప్రజలకు అనుమానాలు కలుగజేస్తున్నాయి కూడా.

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి తల్లి, చెల్లితో ఆస్తివివాదాలలో మునిగి తేలుతున్నారు కనుక ఆ పార్టీ ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించలేకపోతోంది. కనుక ఆ బాధ్యత కూడా జనసేనే నిర్వహిస్తూ, వైసీపిని పూర్తిగా సైడ్ చేసేయాలనే వ్యూహంలో భాగంగానే పవన్‌ కళ్యాణ్‌ ఈవిదంగా మాట్లాడారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అవి ఎంత మాత్రం సహేతుకంగా లేవు.

ఉప ముఖ్యమంత్రిగా, అటవీ, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ తమ ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుంటే, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు కూడా చులకనభావం ఏర్పడుతుంది. ఇది కూటమికి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు.

ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ కళ్యాణ్‌లో ఇంకెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో?ఆయన ఏ దిశలో అడుగులు వేయబోతున్నారో?అనే సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories