బద్వేలులో ప్రేమోన్మాది చేతిలో బలైన బాలిక కుటుంబాన్ని వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ నేను బద్వేల్ వస్తున్నానని తెలియగానే అధికారులు హడావుడిగా వచ్చి బాధిత కుటుంబానికి సాయం అందించారు. ఒకవేళ నేను రాకుంటే వారిని పట్టించుకునేవారే కాదు. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు,” అని జగన్ విమర్శించారు.
ఓ పక్క తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకీడ్చి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని జగన్ వాపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది వరకు ఆమె, సునీతా రెడ్డి వివేకా హత్య కేసులో మాత్రమే జగన్‌ని వేలెత్తి చూపేవారు. ఇప్పుడు ఈ ఆస్తుల వివాదంలో షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా జగన్‌ని తప్పు పడుతున్నారు.
జగన్‌కి షర్మిల వ్రాసిన లేఖలో ఆమె కూడా సంతకం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈవిదంగా కుటుంబంలో ఆడవాళ్ళే తనని వేలెత్తి చూపిస్తుంటే, జగన్ చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపడం విడ్డూరంగా ఉంది కదా?
చంద్రబాబు నాయుడు పట్ల జగన్‌కి ఉన్న ఈ విద్వేషమే వైసీపి రాజకీయ విధానంగా మారిపోయింది. అందువల్లే లక్షల కోట్ల విలువైన రాజధాని అమరావతిని కూడా పాడుబెట్టేశారు.
తమ ఇంట్లో ఆస్తుల వివాదాన్ని తల్లి, చెల్లితో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. కానీ అలా చేయకుండా దానిపై కూడా రాజకీయాలు చేస్తూ, సొంత పార్టీ నేతల చేత కూడా రాజకీయాలు చేయిస్తూ, చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం జగన్ తెలివితేటలకు మరో మచ్చుతునక.
ఇవన్నీ జగన్ విచిత్ర ధోరణికి అద్దం పడుతున్నవే. కానీ తాను చాలా మంచివాడినని, చంద్రబాబు నాయుడు, తన చెల్లీ దుర్మార్గులని వాదించడం జగన్‌కే చెల్లును. అరాచక పాలన కారణంగానే తాము అధికారం కోల్పోయామని జగన్ అంగీకరించన్నట్లే ఇప్పుడు తల్లి, చెల్లితో ఆస్తుల వివాదంలో కూడా వారిదే తప్పు తాను ధర్మాత్ముడినాని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారు.
జగన్, వైసీపి తీరుని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. కనుక మరిన్ని తప్పులు చేస్తూ ప్రజల దృష్టిలో మరింత పలచనవడం అవసరమా? జగన్ ఆలోచించుకుంటే మంచిది. లేకుంటే మళ్ళీ ఆయనే నష్టపోవడం ఖాయం.






