“నా భార్యా నన్ను సుఖపెట్టాలి… అది ఆమె బాధ్యత! లేకుంటే పరాయి ఆడదానిపై కన్నేస్తా…” అనే మొగుడులా ఉంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు, వ్యవహార శైలి.
ఆయన భారత్‌ని ఉద్దేశ్యించి “వాళ్ళు నన్ను సంతోషపెట్టాలనుకుంటున్నారు. కానీ సంతోషపెట్టలేకపోతున్నారు. నన్ను సంతోషపెట్టలేకపోతే నాకు కోపం వస్తుంది. అప్పుడు మళ్ళీ సుంకాలు పెంచాల్సి వస్తుంది,” అని అన్నారు.
ఆయనని సంతోషపెట్టి సుంకాలు తగ్గించుకునేందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గించుకుంది. సుమారు రూ.800 కోట్లు విలువగల ఆయుధ ఒప్పందం చేసుకుంది.
ఇదే విషయం చెప్పి ‘వాళ్ళు’ తనను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ట్రంప్ అన్నారు. కానీ తనకు సంతోషం కలగడం లేదన్నారు. తనను పూర్తిగా సంతోషపెట్టాల్సిన బాధ్యత వాళ్ళదే అన్నారు.
అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా మానుకోవాలని ట్రంప్ సూచిస్తున్నారన్న మాట. అమెరికా సార్వభౌమత్వం చాలా ముఖ్యం.. చాలా విలువైనదని గొప్పగా చెప్పుకునే ట్రంప్ ‘వెనిజులా’ని ఎంత దారుణంగా అవమానించారో అందరూ చూశారు.
ఇప్పుడు భారత్‌తో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాము. డెన్మార్క్ దేశంలో భాగంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ విషయంలో కూడా ఇంకా హీనంగా వ్యవహరించేందుకు ట్రంప్ సిద్ధం అవుతున్నారు.
“మీ ఇంట్లో ఎలుకలు, బొద్దింకల వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనుక వెంటనే ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపో.. నేను తీసేసుకుంటున్నాను,” అని చెప్పినట్లుగా వెనిజులా అధ్యక్షుడుకి చెప్పారు.
ఆయన ఖాళీ చేయకపోవడంతో ట్రంప్ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. ఇంకా క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలలో కూడా మాదక ద్రవ్యాలు ఉన్నాయని కనుక వాటిపై కూడా దాడులు చేసి ఆ మూడు దేశాలను కూడా మా నియంత్రణలోకి తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పుడు “గ్రీన్ ల్యాండ్ మాకు అవసరం ఉంది మేము తీసేసుకుంటాము,” అని చెబుతున్నారు. ట్రంప్ ఏదో మాట వరసకి మాట్లాడారని, మనసులో ఉన్న ఆలోచనలనే ఇలా ముందుగా బయటపెడుతుంటారని ఇప్పటికే ప్రపంచ దేశాలకు బాగా అర్థమైంది.
ట్రంప్ ఇంత దురహంకారంతో వ్యవహరిస్తుంటే ఐఖ్యరాజ్యసమితి, నాటో, జీ12తో సహా ఎవరూ కూడా ట్రంప్‌కి ‘ఇది తప్పు… చూస్తే ఊరుకోము,” అని చెప్పడానికి భయపడుతున్నాయి. వాటి భయమే ట్రంప్‌కి ఇంత ధైర్యం లభిస్తోందని చెప్పక తప్పదు.






