ఒక దేశం ఏయే దేశాలతో ఎంత వరకు వాణిజ్య సంబంధాలు నెరపాలి? ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవిధంగా ఉండాలి? అనేది ఆయా దేశాల అంతరంగిక విషయం.
కానీ “వాటిని నేనే నిర్ణయిస్తుంటాను… అందరూ తూచా తప్పకుండా పాటించల్సిందే. లేకుంటే సుంకాలు పెంచేస్తాను… ఏదో వంకతో బాంబుల వర్షం కురిపిస్తాను… లేకుంటే మీ దేశాధినేతలను ఎత్తుకుపోతాను,” అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు.
తెల్లారి నిద్రలేచిన తర్వాత ఆయనకు ఏ ఆలోచన కలుగుతుందో ఎవరికి మూడుతుందో ఎవరికీ తెలీదు. వెనిజులా దేశాధ్యక్షుడుని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని, దానిలో ఆయిల్ కంపెనీలను కబ్జా చేసిన తర్వాత ఇరాన్ మీద దాడికి రంగం సిద్ధం చేస్తున్నారిప్పుడు.
రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని భారత్‌పై ఒత్తిడి చేసిన ట్రంప్ దొర, ఇప్పుడు క్యూబాతో ఎవరూ వాణిజ్య లావాదేవీలు జరుపరాదని హుకుం జారీ చేశారు.
భారత్‌తో వాణిజ్యం వద్దనుకున్న ట్రంప్ అమెరికా తలుపులు మూసేయడంతో యూరప్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దానినీ ట్రంప్ దొర జీర్ణించుకోలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా ఆర్ధికమంత్రి స్కాట్ బెసెంట్ మీడియాతో మాట్లాడుతూ, “ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేసేందుకు ట్రంప్ కృషి చేస్తుంటే, అదేమీ పట్టన్నట్లు యూరప్ దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఒప్పందం మమ్మల్ని తీవ్ర నిరాశ పరిచింది,” అని అన్నారు. అంటే యూరప్ దేశాలు ఎవరితో వాణిజ్యం చేయాలో, చేయరాదో ట్రంప్ దొర చెప్తారు.. ఆయన చెప్పినట్లు చేసుకోవాలన్న మాట!
తాను ప్రపంచ దేశాలను భయపెట్టి కట్టడి చేస్తున్నానని ట్రంప్ భ్రమలో ఉన్నారు. కానీ ప్రపంచదేశాలలో అమెరికాని ఏకాకిగా మారుస్తున్నానని గ్రహించడం లేదు. ఇప్పటికే పలుదేశాలకు అమెరికాపై పీకల వరకు కోపం ఉంది. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, చర్యల వలన అమెరికాకి శత్రువులు పెరిగిపోతున్నారని ట్రంప్ దొర గ్రహించడంలేదు. ట్రంప్ ఈ పదవిలో నుంచి దిగిపోయే నాటికి అమెరికాకి ఇంకెంత నష్టం చేస్తారో?






