దువ్వాడ-దివ్వెల రొమాన్స్‌ స్టోరీలో ఈ ట్విస్ట్ ఏమిటి?

Duvvada Srinivas controversy after YSRCP suspension and public challenge in Andhra Pradesh

ఇదివరకు జగన్‌ నుంచి ‘చాలా మంచోడు’ సర్టిఫికేట్ పొందిన వైసీపీ నేతలలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. అంతేకాదు.. శ్రీనివాస్ హృదయం చాలా విశాలమైనది. కనుక దానిలో భార్య, పిల్లలతో పాటు దివ్వెల మాధురికి కూడా కాస్త చోటు ఇచ్చారు.

అది ఆయన భార్య పిల్లలు అర్ధం చేసుకోలేదు. కనుక వారు ఆయనని కుటుంబం నుంచి సస్పెండ్ చేశారు. అందరికీ ప్రేమ పంచాలనుకునే జగన్‌ కూడా దువ్వాడ ప్రేమతత్వాన్ని అర్ధం చేసుకోలేక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు!

ADVERTISEMENT

పోతే పోయాయి.. కుటుంబం, పార్టీ, పదవీ, పరువు, ప్రతిష్టలు… అనుకుంటూ ఇద్దరూ హాయిగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈవిధంగా కూడా వారికి ఓ కొత్త గుర్తింపు లభిస్తోంది. కనుక నో రిగ్రెట్స్!

కనుక వైసీపీ గురించి ఆలోచించే పరిస్థితిలో ఆయన లేనే లేరు. కనుక అయన జోలికి వైసీపీ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళింది. స్థానిక వైసీపీ నేతలు కొందరు తమ పార్టీ స్టయిల్లో ఆయనని చితకొట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నారు.

ఈ విషయం ఆయన మనసు దోచుకున్నమాధురికి తెలిసింది. అంతే! ఆమె ఈ విషయం దువ్వాడ చెవిలో వేసి, తమని అప్రమత్తం చేసిన వ్యక్తితో మాట్లాడిన ఫోన్ సంభాషణని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఓ పక్క అది వైరల్ అవుతుంటే, దువ్వాడ శ్రీనివాస్‌లో నిద్రపోతున్న వైసీపీ నాయకుడు కూడా నిద్ర లేచాడు.

నిన్న అర్దరాత్రి టెక్కలికి వెళ్ళే దారిలో నిమ్మాడ జంక్షన్ వద్ద నిలబడి ‘బస్తీమే సవాల్’ అన్నారు. “నన్ను చితకొడ్తామన్నవాళ్ళు దమ్ముంటే రండి. నేను ఇక్కడే ఉన్నాను. నన్ను చంపినా నేను భయపడను. మీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?

వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం కాదు బహిష్కరిస్తే అపుడు మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లడుతాను. ఇకపై నా నియోజకవర్గంలో నేను స్వతంత్రంగా పనిచేసుకుంటాను. ఎవడు నన్ను ఆపుతాడో నేనూ చూస్తాను. దేనికైనా నేను రెడీ…” అంటూ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నేతలకు సవాలు విసిరారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, కింజారపు అప్పన్న అనే ఆయన సన్నిహితుడు టెక్కలిలో కొందరు వైసిపీ నేతలు నరసన్న పేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్‌పై దాడి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పారు.

దువ్వాడ శ్రీనివాస్, మాధురీ ఇద్దరూ పార్టీని, రాజకీయాలను విడిచిపెట్టి హాయిగా రొమాన్స్ చేసుకుంటూ వారి మానాన్న వారు జీవిస్తుంటే, మద్యలో వారిని కెలకడం దేనికి?

ఇప్పటికే ‘రప్పారప్పా’తో ఆంధ్రాలో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పుడు దువ్వాడని కూడా ‘రప్పా రప్పా’ వేసేస్తామంటే ప్రజలేమనుకుంటారు? అని కాస్త ఆలోచించాలి కదా?

ADVERTISEMENT
Latest Stories