తమిళనాడు సిఎంగా పళనిస్వామి ఖరారు?

Edapadi-Palanisamy-as Tamil nadu Chief Ministerతమిళనాడు రాజకీయాలు కొత్త ముఖ్యమంత్రి దిశగా సాగుతున్నాయి. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా వస్తారని భావిస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలుగా మిగిలిపోనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత పది రోజులుగా, పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన వేళ, తాజాగా శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పన్నీర్ వర్గంలోకి ఎవరూ వచ్చి చేరకపోవడంతో పన్నీర్ కు అవకాశం లేకుండా పోయిందనేది తాజా సమాచారం.

శశికళ సూచించినట్టుగా అందరమూ ఏకతాటిపై పళనిస్వామి వెంటే ఉన్నామన్న సంకేతాలు ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేళ, ఆయనే కాబోయే సీఎం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో 117 మంది ఎమ్మెల్యేలను చూపి ఆయన మెజారిటీని నిరూపించుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయని, స్టాలిన్ రంగంలోకి దిగి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఫిరాయింపుల దిశగా ప్రోత్సహిస్తే తప్ప పళనిస్వామిని అడ్డుకోలేరని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పళనిస్వామి క్యాంపులో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.

ADVERTISEMENT

124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి, గవర్నర్ కు లేక ఇచ్చిన నేపథ్యంలో, ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చని రాజ్ భవన్ వర్గాల నుంచి సంకేతాలు అందినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడుతుందని, పన్నీర్ సెల్వం ఏ విధమైన లేఖా ఇవ్వనందున, ఆయన రాజీనామా చేసి వున్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం, పళనిస్వామిని పిలవాలని రాజ్యాంగ నిపుణులు సూచించిన నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories