ఎవరు ఔనన్నా కాదన్నా… తెలుగు ప్రజలకు వార్తపత్రికని అందుబాటులోకి తెచ్చింది రామోజీరావు అని చెప్పకతప్పదు. ఈనాడు కంటే ముందు తెలుగు పత్రికలు లేవా అంటే చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి అనేక పత్రికలు ఉండేవి. కానీ అవి ఆనాటి పరిస్థితుల కారణంగా ప్రజలకు చేరడంలో ఆలస్యమవుతుండేవి.
ఇది గమనించిన రామోజీరావు ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించాలంటే స్థానికంగానే ముద్రణాలయం ఉండాలని గ్రహించి సరిగ్గా 49 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 1974, ఆగస్ట్ 10న విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు పత్రిక ముద్రణా సంస్థని ప్రారంభించారు.
ఈ నిర్ణయం తెలుగు పత్రికారంగంలో సమూలమైన మార్పులకు బీజం వేసింది. ప్రతీరోజూ తెల్లవారేసరికి తెలుగువారి ముంగిట్లలో ‘ఈనాడు’ న్యూస్ పేపర్ పడుతుండటంతో తెలుగు ప్రజలు ఈ మార్పుని స్వాగతించారు. మొదట కేవలం 5,000 కాపీలతో విశాఖలో ప్రస్థానం ప్రారంభించిన ఈనాడు తెలుగు ప్రజలతో అనుబందం పెంచుకొంటూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా అన్ని ప్రధాన నగరాలలో ముద్రణాలయాలు ఏర్పాటుచేసుకొని రాష్ట్రమంతటా విస్తరించింది.
అయితే తెల్లవారుజామునే న్యూస్ పేపర్ అందించడంతోనే ఈనాడు సరిపెట్టుకోలేదు. చక్కటి పేజీల కూర్పు, అచ్చుతప్పులు లేకుండా శ్రద్ద వహించడం, గ్రాంధిక భాషను, మాండలీకాలను పక్కన పెట్టి సరళమైన తెలుగుభాషలో వార్తలు అందించడం, స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి వార్తలను ఎక్కువగా కవర్ చేయడం, క్రమం తప్పకుండా ఆలోచింపజేసే రాజకీయ కార్టూన్స్, సంపాదకీయాలు ప్రచురిస్తుండటం వంటి అనేక అంశాలతో ఈనాడుని అతితక్కువ సమయంలోనే అగ్రగామిగా నిలిపాయి.
ఆ తర్వాత మిగిలిన పత్రికలన్నీ కూడా ఈనాడు మార్గాన్నే అనుసరించాయి. కానీ ఈనాడు ఎల్లప్పుడూ ఓ అడుగు ముందుంటూ వాటన్నిటికీ మార్గదర్శిగానే నిలిచింది. ఈనాడు పత్రిక లోకల్ ఎడిషన్, గ్రామీణ ఎడిషన్, మహిళల కోసం వసుందర, ఆదివారం అనుబందం అంటూ చేసిన ప్రయోగాలన్నీ పత్రికారంగంలో పెనుమార్పులు అనివార్యం చేశాయి.
ముఖ్యంగా రాజకీయవార్తలపై తెలుగు ప్రజలకు మక్కువ ఎక్కువని గ్రహించిన రామోజీరావు వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే వాటిపై ప్రముఖ జర్నలిస్టుల చేత విశ్లేషణలు కూడా చేయించి ఈనాడు ద్వారా ప్రజలకు అందించేవారు. అభివృద్ధి, నేరాలు, ప్రజాసమస్యలు, సినిమాలు,అంతర్జాతీయ విశేషాలు… ఒకటేమిటి ప్రజలకు ఆసక్తి ఉందనుకొన్న ప్రతీ ఒక్కటీ ఈనాడు ద్వారా అందించారు.
ఈనాడు పత్రికని ఈ స్థాయిలో నిలబెట్టడానికి రామోజీరావు చాలా బలమైన వ్యవస్థనే ఏర్పాటుచేశారు. వార్తల సేకరణకు గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వేలాదిమందిని విలేఖరులను నియమించుకొన్నారు. అలాగే ఈనాడు వార్తా పత్రికలను తెల్లవారేసరికి ప్రజల గుమ్మాలలో పడేందుకు వేలాదిమంది న్యూస్ ఏజంట్స్ నినియమించుకొన్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించుకొంటూ ఈనాడును మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఈనాడు ద్వారా ప్రజలకు వార్తలు చేరవేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై రామోజీరావుకు సంపూర్ణ అవగాహన ఏర్పడింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఓ బలమైన నాయకుడు, బలమైన రాజకీయ పార్టీ చాలా అవసరమని భావించారు. అప్పటికే ప్రజలలో మంచి పేరు, భారీగా డబ్బు సంపాదించుకొన్న రామోజీరావు కావాలనుకొంటే స్వయంగా పార్టీ పెట్టుకొని రాజకీయాలలోకి ప్రవేశించవచ్చు. కానీ తన బాధ్యతలని విస్మరించకుండా పత్రికారంగానికే పరిమితమయ్యారు.
ఆనాడు తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగుతున్న ఎన్టీఆర్‌ని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావలసిందిగా ప్రోత్సహించారు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఈనాడు ఆయనకు అండగా నిలబడి రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో తోడ్పడింది. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. నాటికీ నేటికీ ఈనాడు అదే స్పూర్తితో ముందుకు సాగుతూనే ఉంది. 49 ఏళ్లుగా ఓ పత్రికను తెలుగువారు ఇంతగా ఆదరిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు.
వర్తమాన రాజకీయాలలో కొందరు ఆకాశంలో సూర్యుడిపై కూడా ఉమ్మాలని ప్రయత్నిస్తుంటారు. ఈనాడుపై కూడా అటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ప్రజలగొంతుగా నిలుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను, దాని అనాలోచిత నిర్ణయాలను, వాటి పర్యవసానాలను నిలదీసి ప్రశ్నిస్తుండటమే కారణం.
కనుక ఈనాడు ప్రతిష్టను, దాని ఆర్ధికమూలాలను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ 49 సంవత్సరాలుగా ఈనాడుతో పెనవేసుకుపోయిన తెలుగుప్రజల అనుబందాన్ని ఎవరూ వేరుచేయలేరు. నేటితో 49 సంవత్సరాలు పూర్తిచేసుకొని 50వ వసంతంలో అడుగుపెడుతున్న ఈనాడుకి అభినందనలు.



