తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన ఉమ్మడి ఏపీకి పదేళ్ళపాటు హైద్రాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. అయితే వచ్చే నెల జూన్ 2 తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడంతో విభజన చట్టంలో ప్రామాణికాల ఆధారంగా ఏపీ కి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైద్రాబాద్ పై హక్కును ఏపీ కోల్పోబోతుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది.
విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఏపీలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి సాక్షాత్తు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఉద్దండరాయపాలెం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి పాలనకు అవసరమైఅన్ అన్ని భవనాలను అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి నిర్మాణాలను చేపట్టి రాజధాని కి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లారు.
ఇందులో భాగంగానే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వం. 2016 లోనే దాదాపు 90 శాతం ఏపీ కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలించిన టీడీపీ ప్రభుత్వం హైద్రాబాద్ తో ఉన్న ఉమ్మడి సంబంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు. అయితే 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ మొదలుపెట్టిన ఆటకు హైద్రాబాద్ తోనే శంకుస్థాపన చేసింది.
జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేప్పట్టిన రోజే హైద్రాబాద్ లో ఉన్న ఏపీ ఉమ్మడి ఆస్తులను, హక్కులను అప్పటి తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ కు ఒకేఒక్క సంతకంతో దారాదత్తం చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనితో పదేళ్ల హక్కును, అవసరాన్ని ఐదేళ్లకే ఏపీ ప్రజలు కోల్పొవల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏపీ కి రాజధాని ఏది అంటే కనీసం దానికి సమాధానం చెప్పే ధైర్యం కానీ, సాహసం కానీ చేయడానికి దేశంలోనే ఏఒక్కరు ముందుకు రాలేదు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి.
అంతెందుకు వైసీపీ నాయకులే ఒకసారి ఏపీకి మూడు రాజధానులు అని, మరో సారి విశాఖ ఒక్కటే ఏపీ రాజధాని అని, ఇంకో సందర్భంలో అసలు ఏపీకి రాజధాని అవసరమేముంది ఉమ్మడి రాజధానిగా ఏపీ కి హైద్రాబాద్ ఉంది కదా మళ్ళీ ప్రత్యేకించి ఏపీకి మరో రాజధాని ఎందుకు అంటూ అటు ప్రజలను ఇటు పార్టీలను కన్ఫ్యుజ్ చేస్తూ ఐదేళ్ల పదవి కాలాన్ని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం.
ఇలా ఏపీ రాజధాని అనేది కొన్ని కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంగా ఏపీ ప్రజానీకం భావిస్తుంటే వైసీపీ మాత్రం దీనిని ఒక రాజకీయ వ్యూహంగా మార్చి రాష్ట్రాన్ని అభిమన్యుడు మాదిరి కుప్పకూలేలా చేసింది. అయితే ఈ జూన్ 2 లోగా హైద్రాబాద్ లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం నోటిసులు జారీ చేసింది. దీనితో ఈ జూన్ 2 తో హైద్రాబాద్ పై ఏపీ ప్రజల ఉమ్మడి హక్కుకు కాలం చెల్లనుందా అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు ఏపీ ప్రజానీకం.
హైద్రాబాద్ అభివృద్ధిలో ఏపీ ప్రజల భాగస్వామ్యం కూడా సమానంగా ఉండడంతో ఒక్కసారిగా హైద్రాబాద్ తో బంధం తెగిపోతుంది అంటే అది ఎన్నో మనసులకు గాయం చేయక మానదు. అయితే మరికొన్నాళ్లు హైద్రాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ జెడి. లక్ష్మి నారాయణ డిమాండ్ చేస్తున్నారు.




