భారీ వర్షాలు, బుడమేరు పొంగడం వలన విజయవాడ వరద నీటిలో మునిగినప్పుడు, ఎప్పటిలాగే వైసీపి బురద రాజకీయాలు చేసింది.
అమరావతి మునిగిపోయిందని, హైకోర్టు, సచివాలయం పూర్తిగా మునిగిపోవడంతో వాటిలో పనిచేసే న్యాయవాదులు, ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారని సోషల్ మీడియాలో వైసీపి చాలా దుష్ప్రచారం చేసింది.
ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసం కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడ నగరాన్ని వరద నీటిలో ముంచేశారని జగన్ ఆరోపించారు. కానీ వాస్తవాలు విజయవాడ ప్రజలకు తెలుసు కనుక ఎవరూ వైసీపి దుష్ప్రచారాన్ని నమ్మలేదు.
అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని అది రాజధానిగా పనికిరాదని నేటికీ జగన్, వైసీపి వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
ఇప్పుడు భారీ వర్షాలు, తుఫానుల కారణంగా బెంగళూరు, చెన్నై నగరాలు రెండూ నీట మునిగాయి. ఇదివరకు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు నగర ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కనుక ఈసారి ముందు జాగ్రత్త చర్యగా కుటుంబాలతో సహా సురక్షిత ప్రాంతాలలోని స్టార్ హోటల్స్ లో రూములు బుక్ చేసుకొని వాటిలోకి వెళ్లిపోతున్నారు.
అంతగా అభివృద్ధి చెందిన నగరాలలోనే ఇటువంటి పరిస్థితులున్నప్పుడు ఇంకా నిర్మాణం పూర్తికాని అమరావతిలో ఇంకా దారుణంగా ఉండాలి కదా?కానీ పక్కనే ఉన్న విజయవాడ నగరం, ఇప్పుడు చెన్నై, బెంగళూరు నగరాలు నీట మునిగినా అమరావతి మాత్రం నీట మునగలేదు!
ఇదివరకు సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు నిర్మిస్తున్నప్పుడు టిడిపి ప్రభుత్వం అవన్నీ ‘తాత్కాలిక భవనాలు’ అని చెప్పడంతో వైసీపి దానిని రాజకీయ అస్త్రాలుగా మార్చుకొని ఎదురుదాడి చేసింది. కానీ ఆ తర్వాత జగన్ కూడా అవే భవనాలలో ఉంటూ 5 ఏళ్ళ పాలన చేశారు.
అంతకు ముందు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటినే వినియోగించుకొంటోంది. అంటే దాదాపు 15 ఏళ్ళపాటు వరుసగా మూడు ప్రభుత్వాలు వాటిని వాడుకుంటున్నాయన్న మాట! అయినా గత పదేళ్ళలో ఏనాడూ అమరావతి, వాటిలో భవనాలు నీట మునగలేదు. అంటే వైసీపి వాదనలన్నీ అర్దరహితం, రాజకీయ దురుదేశ్యంతో కూడుకున్నవే అని అర్దమవుతోంది.




