రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అప్పుడే 100 కోట్లు కలెక్ట్ చేసి, వసూళ్ల వేటను ఇంకా కొనసాగిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. తాజాగా ప్రముఖ జానపద కళాకారుడు శివనాగులు ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పై మండిపడ్డారు.
ఈ సినిమాలో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టుకొస్తావా’ అనే పాటను శివనాగులు పాడారు. ఆడియో ఈవెంట్ లో కూడా ఆయనను వేదికపైకి పిలిచి, ఆ పాటను పాడించారు. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంగా ఉన్న ఆయనకు… సినిమా విడుదలయ్యాక షాక్ తగిలింది. వెండితెరపై ఆ పాటలో శివనాగులు వాయిస్ కాకుండా… దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించడంతో శివనాగులు శివాలెత్తుతున్నారు.
చిన్న చిన్న వేదికలపై పాటలు పాడుకునే తన వాయిస్… ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినిపించిందని శివనాగులు చెప్పారు. అయితే సినిమా విడుదలయ్యాక తన వాయిస్ లేకపోవడం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాయిస్ ను మార్చుతున్నట్టు తనకు ఒక్క మాటైనా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు.
ఆడియో ఫంక్షన్ లో తనపై ప్రశంసలు కురిపించిన దేవిశ్రీ ప్రసాద్… పది రోజుల్లోనే తన ఆశలపై నీళ్లు చల్లారని,ఇలాంటి ఘటనలు ఇకపై మరెవ్వరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగింది. ప్రస్తుతం అది మరో రూపం సంతరించుకుంటోంది.



