వారికి ఉచితాలు…వీరికి సబ్సిడీలు..మరి వీళ్ళకేంటి.?

YCP TDP

పేదరికంలేని సమాజమే మా ప్రభుత్వ ధ్యేయం, పేదవాడి ఉన్నతే మా ప్రభుత్వ లక్ష్యం, ఇది పేదల ప్రభుత్వం….ప్రభుత్వాలు మారిన ఈ ప్రకటనలలో ఎటువంటి మార్పు ఉండదు, అలాగే పేదవాడి బతుకులో ఎటువంటి వెలుగు కనపడదు.

అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వం నుంచి పేదలకు దక్కే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయి. అయినా వారి జీవన ప్రమాణంలో ఎదుగుదల శూన్యమనే చెప్పాలి. అయితే వారి ఉన్నతికి ఈ సంక్షేమ పథకాలు నిచ్చెనలా ఉపయోగపడాలే కానీ వాడుకుని పడేసే టిష్యూ కాకూడదు.

ADVERTISEMENT

అలాగే ఒక రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామిక రంగం వెన్నెముకగా నిలబడుతుంది, రాష్ట్రాన్ని నిలబెడుతుంది. వారు తమ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి తమ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినందుకు గాను ఆయా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో వారికి చేయూతనిస్తుంది, ఇవ్వాలి కూడా.

అయితే ప్రభుత్వాలు పేదవారికి ఉచిత పథకాల రూపంలో సంక్షేమం అందిస్తుంది. బడా బాబులకు సబ్సిడీల రూపంలో చేయూతనిస్తుంది. కానీ ఆ ప్రభుత్వ ఖజానాను నింపడంలో ప్రథమ భూమిక పోషించే మధ్యతరగతి జీవితాలకు మాత్రం ఎటువంటి ఊరట ఇవ్వలేకపోతున్నారు.

వైసీపీ ప్రభుత్వం అందించిన నవరత్నాలు కానీ, కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలు కానీ ఈ మధ్యతరగతి కుటుంబాలకు చేరవు. కానీ వాటి అమలు కోసం ప్రభుత్వాలు బాదే పన్నులలో మాత్రం వాటా దక్కించుకుంటారు. వీరికి ఉచితాల మీద ఆశ ఉండదు…సబ్సిడీల అవసరం రాదు.

ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ వర్గం ప్రజల కోసం ఆలోచించే నాయకుడే కనిపించడం లేదంటూ మధ్యతరగతి ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. కేవలం వీరు రాజకీయ పార్టీలకు ఒక ఓటు బ్యాంకు గా మాత్రమే మారుతున్నారు. ఈ వర్గం వారు ప్రభుత్వాల నుంచి ఉచితాల కోసం ఆశపడరు కానీ నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలి, పన్నుల బాదుడు తక్కువ మోతాదులో ఉండాలి, పెరిగిన ధరలు అదుపు చెయ్యాలి అని మాత్రమే ఆశిస్తారు.

పెట్టుబడులు పెట్టేంత ఆర్థిక స్తోమత వీరి వద్ద ఉండదు కాబట్టి సబ్సిడీల అవసరం వీరి దరిచేరదు. కానీ ఆ పారిశ్రామిక రంగంలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం మాత్రం ఆశ పడతారు దానికి తగ్గ కష్టం చేస్తారు. అయినా ప్రభుత్వాల నుండి, రాజకీయ పార్టీల నుండి వీరికి ఎటువంటి గుర్తింపు దక్కదు.

ప్రభుత్వాలకు, పథకాలకు మధ్య నలిగి పోతూ ఎవరిని నిందించలేక, ఎవరిని సాయం అడగలేక, రాజకీయ పార్టీల కు ఓటు బ్యాంకుగా, ప్రభుత్వాలకు నోటు బ్యాంకుగా బతుకు జట్కా బండిని నడుపుతున్నాడు సగటు మధ్యతరగతి జీవుడు. మోతాదుకు మించి ఉచితాలు ఇవ్వడం ఆ రాష్ట్ర అభివృద్ధికే తీరని లోటుని మిగులుస్తుంది.

నాయకులు సంక్షేమం, అభివృద్ధి తో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలను బాగు పరచాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్నేళ్లు ఎదురు చూడగలిగిన ఒక సామాన్యుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెనకడుగు వేస్తున్నాడు.

ఈ ధోరణి మారాలి, మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే విద్యా, వైద్యం కాదని వేలు ఖర్చు పెట్టి ప్రయివేట్ సంస్థల బాట పట్టడానికి కారణమేమిటో ఒక్కసారి ప్రభుత్వాలు, అధికారులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రభుత్వాలు వీటి నాణ్యతలో బలాన్ని పెంచితే మధ్యతరగతి జీవితాలకు పెద్ద ఊరట దక్కినట్టే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories