పెట్రోల్, డీజిల్‌, గ్యాస్: వైసీపీ, బీఆర్ఎస్‌ లెక్కలు వేరే!

Political leaders reacting to gas price hike with protests and discussions highlighting fuel price impact on public and politics in India

ఎన్నికలు పూర్తవగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తప్పక పెంచేస్తుందని అందరూ అనుకుంటున్నదే. అదే జరిగింది. కమర్షియల్ గ్యాస్ ధరని ఒకేసారి 993 పెంచేయడంతో కాంగ్రెస్‌తో సహా దేశంలో బిజేపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరగడం సహజమే. అలాగే ఎన్డీయేలో ఉన్నందున టీడీపి, జనసేన మౌనంగా ఉండిపోవడం కూడా అంతే సహజం.

ADVERTISEMENT

కానీ ఏదో రోజు బిజేపితో పొత్తులు పెట్టుకోవడం ఖాయమని భావిస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ కూడా నిప్పులు చెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటీవల జగిత్యాల సభలో ఇందిరా గాంధీ గొప్ప నాయకురాలని కేసీఆర్‌ పొగిడారు. ఇప్పుడు బిజేపిని విమర్శిస్తున్నారు. అంటే తమతో పొత్తుకి బిజేపి ముందుకు రాకపోతే కాంగ్రెస్‌తో అంటుకడతామని సంకేతం పంపిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.

ఇక బిజేపితో పొత్తులు పెట్టుకునే ఆలోచన కూడా చేయని వైసీపీ కేంద్రంతో చాలా సఖ్యతగా ఉంటుంది. కనుక అది కూడా గ్యాస్ ధర పెంపుపై మౌనం దాల్చింది.

కానీ పెట్రోల్, డీజిల్ కొరతపై నిప్పులు చెరుగుతోంది… కేంద్రం మీద కాదు సిఎం చంద్రబాబు నాయుడు… అమరావతి మీద!

కూటమి ప్రభుత్వం అమరావతిలో కాంట్రాక్టర్లకు నిరాటంకంగా డీజిల్ సరఫరా చేస్తూ రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించిందని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశాయి.

జగన్‌ అమరావతి వద్దనుకున్నారు కనుక దానిని వ్యతిరేకించడం సహజమే. కానీ బోడి గుండుకు మోకాలికి ముడేస్తునట్లు పెట్రోల్, డీజిల్ కొరతని అమరావతితో ముడిపెట్టి నిరసన దీక్షలు చేయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

పెట్రోల్, డీజిల్ పేరుతో ఇలాంటి చవుకబారు రాజకీయాలు చేస్తున్న వైసీపీ, వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయలు పెంచితే ఎందుకు నోరెత్తడం లేదు?అంటే రాష్ట్రంలో అడిగేవాళ్ళు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories