టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తలు జగన్ ప్రభుత్వం ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో వంతాడపల్లి పంచాయతీ, సప్పిపుత్తు గ్రామంలో ఆదివారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి మా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే మూయించేశాడు. ఎన్టీఆర్ హయాంలో పేదవాళ్ళ కోసం కట్టిన ఇళ్ళపై ఓటిఎస్ పేరిట డబ్బులు వసూలు చేస్తుండటం సిగ్గుచేటు.
మా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తే ఆయనను అడ్డుకోవడం చాలా దారుణం. కుప్పం ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతుండటంతో వైసీపీ ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైంది. అందుకే అడ్డుకొన్నారు. కానీ జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ మరో ఛాన్స్ ఇవ్వరు ప్రజలు,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు సుబ్బారావు, కోడా సురేశ్ కుమార్, గబ్బాడ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.



