ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో తయారు చేయించుకున్న చొక్కాను ధరించి, అన్ని వేళ్లకు ఉంగరాలు, మెడ నిండా బంగారు గొలుసులతో దర్శనమిచ్చే పుణెకు చెందిన ‘గోల్డ్ మ్యాన్’ దత్తాత్రేయ ఫూజ్ (44) సిటీకి సమీపంలోని దిఘీలో హత్యకు గురయ్యారు. గురువారం నాడు రాత్రి కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని దత్తాత్రేయ భార్య సీమ చెప్తున్నారు. భరతమాతనగర్ కు తీసుకు వెళ్లిన వారు తన భర్తపై రాళ్లతో, ఆయుధాలతో దాడి చేసి హత మార్చారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ అయిన ఆమె ఆరోపించారు.
ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో స్వయానా దత్తాత్రేయ మేనల్లుడు కూడా ఉన్నాడు. కాగా, దత్తాత్రేయ చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేశారని, చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయని, ఇన్వెస్టర్లతో ఘర్షణ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు. దీంతో గోల్డెన్ మ్యాన్ మరణం మిస్టరీగా మారింది. బహుశా కస్టడీలోకి తీసుకున్న వారు నోరు విప్పితే గానీ, ఈ హత్యకు గల కారణాలు వెలుగు చూస్తాయేమో!



