ప్రభుత్వాలే రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తేవాలా? ప్రతిపక్షాలు తేకూడదా? అంటే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనేమీ లేదు. కానీ రాజ్యాంగంలో చాలా నిబంధనలను పాటించని ప్రతిపక్షాలు, లేని ఈ ఒక్క నిబంధనను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తుంటాయి.
పదవీ, అధికారం కోల్పోగానే ఇక తమకు ఆ బాధ్యత లేదని భావిస్తుంటాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైనవారు శాసనసభ సమావేశాలకే రానప్పుడు, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తెస్తారని ఆశించడం దురాశే అవుతుంది. కనుక వారిని తప్పు పట్టలేము.
వారు ఏమీ చేయకపోయినా పర్వాలేదు… కానీ ఏదో ఒకటి చేస్తుంటారు… అదే పెద్ద సమస్య!
గత ప్రభుత్వ హయంలో పరిశ్రమల కధలు వినీవినీ చెవులు చిల్లడిపోయాయి. సినిమాలలో మన హీరోల రక్తపాతం ఆగనట్లే ప్రభుత్వం మారినా ఇంకా ఈ స్టోరీలతో జనాలకు చెవిపోటు తప్పడం లేదు.
చంద్రబాబు నాయుడు మొదటిసారి సిఎం అయినప్పుడు ఎంతగానో శ్రమించి అమరావతి నిర్మాణాలు మొదలుపెట్టారు. వాటిని వైసీపీ బ్యాచ్ ‘గ్రాఫిక్స్’ అని కొట్టిపడేసి ‘విశాఖ రాజధాని’ అంటూ నిజంగానే గ్రాఫిక్స్ చూపించింది. భూకంప కేంద్రంలా ఈ గ్రాఫిక్స్ కేంద్రం రుషికొండపై ఐరావతంలా కళ్ళెదుటే ఉంది!
సరే! విశాఖపై వైసీపీకి తప్ప మరెవరికీ ప్రేమ లేదు. కానీ ఆ ప్రేమని జనం అర్థం చేసుకోలేక దించేశారు… లేకుంటేనా? అని సరిపెట్టుకున్నా అంతగా ప్రేమించిన విశాఖకు కూటమి ప్రభుత్వం గూగుల్ కంపెనీ తీసుకువస్తే మోకాలడ్డు పెట్టడం దేనికి?
తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి గూగుల్‌కి భూకేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పరిశ్రమలు, ఐటి కంపెనీలను దక్కించుకోవడం కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే, వాటిని రాష్ట్రానికి రప్పించుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తే తప్పెలా అవుతుంది?అంటూ హైకోర్టు గురుమూర్తికి మద్దెల దరువు వేసి పిటిషన్ కొట్టేసింది.
మొదట ‘యాక్… ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందంటూ’ గూగుల్‌ని వైసీపీ పద్దులో రాసుకున్నారు. సంతోషం! దానిని మేమే తెచ్చామని చెప్పుకున్నప్పుడు మళ్ళీ దానిపై అభ్యంతరం చెపుతూ హైకోర్టుకి ఎందుకు వెళ్ళినట్లు?వెళ్ళి మొట్టికాయలు వేయించుకొని బాధపడటం, నవ్వుల పాలవడం అవసరమా?
గూగుల్‌కి కూటమి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు చాలా అసాధారణంగా, తప్పుగానే కనిపిస్తాయి. కానీ అలాంటి ఒక అంతర్జాతీయ కంపెనీని రప్పిస్తే, అది అయస్కాంతంలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలదు. అప్పుడు వాటన్నిటికీ ఇన్ని రాయితీలు ఈయాల్సిన ఆవసరం లేదు. ఇదివరకు బెంగళూరు, హైదరాబాద్‌లో ఇలాగే జరిగింది. ఇప్పుడు విశాఖలో జరుగుతోంది.
కనుక ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు మేమే అని ఎంతో దూరదృష్టితో మాట్లాడుతున్న వైసీపీ నేతలు, గూగుల్ వలన దీర్గ కాలంలో కలిగే ప్రయోజనాలను మాత్రం చూడలేకపోతున్నారు. ఒకవేళ చూసినా ఒప్పుకోవడానికి అహం, అసూయ అడ్డుపడుతున్నాయి.
వైసీపీ ఇలాగే విశాఖ అభివృద్ధికి మోకాలడ్డుతుంటే ఏదీ ఆగదు… జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి. కానీ నష్టపోయేది మాత్రం వైసీపీయే అని గ్రహిస్తే మంచిది.
చివరిగా ఒక మాట: మనకి చాతకాని పనులు ఎదుటవాడు చేస్తే చూసి నేర్చుకొని బాగుపడే ప్రయత్నం చేయాలి తప్ప అసూయ పడకూడదు. నాడు దుర్యోధనుడు పాండవులను చూసి అసూయ పడితే చివరికి ఏమయ్యాడు? అలాగే ఇదీను.




