జగన్‌ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ వైసీపిని మింగేయబోతోందా?

YS-Jagan-Grama-Ward-Volunteers-YSRCP-Tickets.jpg

పురాణాలలో భస్మాసురుడి కధ అందరూ వినే ఉంటారు. వైసీపిని చూస్తుంటే అదే గుర్తుకువస్తుంది. 2024 ఎన్నికలలో వైసీపిని గెలిపించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్‌ రెడ్డి 2.65 లక్షల మందితో వాలంటీర్ల సైన్యం సృష్టించుకొన్నారు.

వారి ద్వారా ప్రజల వివరాలన్నీ సేకరింపజేసి పెద్ద డాటా సమకూర్చుకొన్నారు. వారి ద్వారానే సంక్షేమ పధకాలు ఇంటింటికీ చేరేలా చేశారు. వారిని సచివాలయవ్యవస్థతో ఆ రెండు వ్యవస్థలను వైసీపితో అనుసంధానం చేసుకొన్నారు.

ADVERTISEMENT

ఈవిదంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎన్నికలకు సిద్దమవుతుంటే, హటాత్తుగా వాలంటీర్లు జీతాలు పెంచాలంటూ సమ్మె ప్రారంభించడం వైసీపికి ముఖ్యంగా వారి సృష్టికర్త జగన్మోహన్‌ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రులను, కార్యకర్తలని కూడా కాదని వాలంటీర్లనే ఆయన ఎక్కువగా నమ్ముకొన్నారు కనుక!

ఇదే… రెండుమూడేళ్ళ క్రితం వారు జీతాలు పెంచాలని కోరి ఉంటే అప్పుడు పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మరో 3-4 నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే ఇప్పటికిప్పుడు 2.65 లక్షలమందికి ఒకేసారి జీతాలు రూ.5000 నుంచి రూ.10-12,000 చేయాలంటే చాలా కష్టం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకే నెలనెలా జీతాలు చెల్లించలేక అవస్థలు పడుతుంటే వాలంటీర్లకు జీతాలు పెంచాలంటే దాదాపు అసాధ్యమే.

మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి ఇదే నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తమ చేత వెట్టి చాకిరీ చేయించుకొంటూ కనీసం కుటుంబపోషణకు సరిపడా జీతాలు ఇవ్వకపోతే ఎలా?అంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, తంబళ్ళ పల్లి వైసీపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి పుండుపై కారం చల్లిన్నట్లు మాట్లాడారు.

బి.కొత్తపేటలో నిన్న ‘ఆడుదాం ఆంద్రా’ క్రీడా పోటీలను ప్రారంభిస్తూ వాలంటీర్లను ఉద్దేశ్యించి, “మీరు జీతం కోసం కాదు… సమాజం కోసం, సమాజంలో మీ గౌరవం కోసమే పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మేము మీకు ఈ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకొన్నందుకు సంతోషించి పనిచేసుకోవాలి కానీ జీతాలు సరిపోలేదని సమ్మె చేస్తామంటే మీరే నష్టపోతారు.

మీరు చేయకపోతే మాకు వాలంటీర్లే కరువా? అనేకమంది ఇదే జీతానికి మీ పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని గుర్తుంచుకోండి. కనుక వేరే ఆలోచనలు చేయకుండా కష్టపడి పనిచేసి వైసీపికి మెజార్టీ వచ్చేలా చేస్తే ఎన్నికల తర్వాత మీ అందరికీ మంచి జరుగుతుంది,” అని హితవు పలికారు.

జీతాలు పెంచబోమని వైసీపి నేతలు తెగేసి చెపుతుండటమే కాకుండా ఈవిదంగా కించపరుస్తూ మాట్లాడుతుండటం వాలంటీర్లను చాలా బాధిస్తోంది. అసలు ఎన్నికలకు ముందు వారు ఇలా చేస్తారని వైసీపి ప్రభుత్వం ఊహించి ఉండదు. వారు కూడా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగానే స్పందిస్తుందని ఆశపెట్టుకొని ఉండవచ్చు. కానీ భిన్నంగా జరుగుతుండటంతో జగన్‌ సృష్టించుకొన్న ఈ వాలంటీర్ల సైన్యమే వైసీపి పతనానికి కారణం అయినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories