సచివాలయాలలో రిజిస్ట్రేషన్స్… తవ్వితే స్కాములు… వద్దులే!

Grama-Ward-Sachivalayam

జగన్‌ వంటి మహా మేధావి ఏపీకి ఒక్కసారి ముఖ్యమంత్రి కావడం వలన అందరికీ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే మహద్భాగ్యం కలిగింది. దానిని దౌర్భాగ్యమని గిట్టనివారు అనుకుంటే అది వారి దౌర్భాగ్యమే తప్ప జగన్‌ది ఎంత మాత్రం కాదు.

ADVERTISEMENT

మూడు రాజధానులు, రివర్స్ టెండరింగ్, వాలంటీర్లు, సచివాలయాలు వంటివెన్నో ఆయన కనిపెట్టి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయ్యింది. కానీ ఏం అభివృద్ధి జరిగింది?అదే… సంక్షేమ పధకాలతో కేవలం 5 ఏళ్ళలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందిపోయింది.

ఇంత చిన్న విషయం కూడా తెలియక కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అంటూ ఊరికే ఆయాసపడుతోంది. అదే జగన్‌ ప్రధాన మంత్రి అయ్యుంటేనా… దేశంలో ఎన్ని కోట్లమంది వాలంటీర్లు ఉండేవారు? ఎన్ని లక్షల సచివాలయాలు ఏర్పడి ఉండేవి? దేశం అంతా నీలాకాశంలా ధగధగా మెరిసిపోతుండేది ఈ పాటికి.

కానీ దేశ ప్రజలకు ఆ అదృష్టం లేదు. కేవలం ఆంధ్రా ప్రజలు మాత్రమే ఆ అదృష్టానికి నోచుకున్నారు. కానీ వారికి జగన్‌ విలువ గుర్తించలేకపోయారు. ఏమాత్రం కృతజ్ఞత చూపకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పజెప్పేశారు.

ఆయన కూడా జగన్‌ దూరాలోచనలను దురాలోచనలని అనేసుకుంటూ ప్రతీదీ సరిద్దాల్సిందే అంటూ సచివాలయాలలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ విధానాన్ని రద్దు చేసేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది కూడా.

గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ హోదా, అధికారాలు కల్పించి వాటిలోనే రిజిస్ట్రేషన్స్ జరిపిస్తే ఎవరూ వాటి కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని జగన్‌ కనిపెట్టి అమలు చేశారు.

అయితే సచివాలయాలలో సెంటు భూముల రిజిస్ట్రేషన్స్ పత్రాలపై జగన్‌ బొమ్మ వేసుకోవడంతో అవన్నీ చెల్లకుండా పోయాయని లబ్ధిదారులు, వాటిని పోగేసుకున్న నాయకులు కూడా పాపం చాలా నష్టపోయారు. గ్రామ సచివాలయాలలో జరిగే రిజిస్ట్రేషన్స్ ఇలాంటి స్కాములకు చాలా వీలు కల్పిస్తాయి.

కనుక వాటిపై కూడా ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తే చాలా కధలే బయటపడవచ్చు. కానీ ఇలా ప్రతీ స్కాముపై దర్యాప్తు జరిపిస్తూపోతే ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోతుందని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మాటని కూడా కొట్టేయలేము.

కనుక రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసి సచివాలయాలలో రిజిస్ట్రేషన్స్ చేసే విధానాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రతీ గ్రామంలో పన్నులు వసూలు చేయడానికి, మౌలికసదుపాయాలు, అభివృద్ధి పనులు చేయడానికి గ్రామ పంచాయితీలు ఉన్నాయి. కనుక రిజిస్ట్రేషన్స్ మాత్రమే కాదు… సచివాలయాలను కూడా రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories