తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి ఎవరంటే ‘కేటీఆర్’ అని విదేశీయులు కూడా చెప్పగలరు. కానీ ఆంధ్రప్రదేశ్ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి ఎవరంటే రాష్ట్రంలో ప్రజలు కూడా చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. కనుక ‘గుడివాడ అమర్నాథ్ మన ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి’ అని చెప్పుకొన్నాక ఆయన ఏమన్నారో చెప్పుకొందాం.
ప్రపంచంలో ఐటి కంపెనీలన్నీ విశాఖ వైపే చూస్తున్నాయి. విశాఖలో చక్కటి సముద్రతీరం కూడా ఉంది కనుక ఐటి కంపెనీలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొనేందుకు మొగ్గుచూపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ప్రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థతో మాట్లాడి విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరగా అందుకు ఆ సంస్థ అంగీకరించింది.
ఈ నెల 16న విశాఖలో ఐటి హిల్స్‌లో తన కార్యాలయం ప్రారంభించబోతోంది. ఇన్ఫోసిస్ వంటి యాంకర్ కంపెనీ విశాఖకు వస్తే దాని వెనకే అనేక ఐటి కంపెనీలు కూడా వస్తాయి. ఐటి కంపెనీలకు విశాఖ నగరం అన్ని విదాలా అనుకూలమైనదని డెలాయిట్ వంటి సంస్థలు చెప్పాయి. త్వరలో అంటే రాబోయే 5 సంవత్సరాలలో విశాఖలోని ఐటి కంపెనీల ద్వారా 2-3 లక్షల మందికి ఐటి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇదీ మంత్రిగారి మాటల సారాంశం. ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అది అప్రస్తుతం.
అయితే విశాఖ నగరం ఐటి కంపెనీలకు అనుకూలమైనదని తామే కనిపెట్టి అభివృద్ధి చేసేస్తున్నట్లు మాట్లాడటం, ‘త్వరలోనే అంటూ రాబోయే 5 ఏళ్లలో’ 2-3లక్షల మందికి ఐటి ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలుకుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఏపీలో విడిపోక ముందు నుంచే విశాఖలో ఐటి కంపెనీలు ఉండేవి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరిన్ని వచ్చాయి. జగన్ వచ్చిన తర్వాత అనేక ఐటి కంపెనీలు మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్ వెళ్లిపోయాయని అందరికీ తెలుసు.
ఆదానీతో జగన్‌కు సత్సంబంధాలు ఉన్నందునే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఒప్పందాన్ని పక్కన పడేయలేదు. అందుకే విశాఖలో ఆదానీ డాటా సెంటర్ ఏర్పాటవుతోంది లేకుంటే అది కూడా లూలూ అనుకొంటూ హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండేదే!
నాలుగున్నరేళ్ళుగా ఐటి కంపెనీలను రప్పించేందుకు జగన్ ప్రభుత్వం ఏమైన ప్రయత్నాలు చేసిందో లేదో తెలీదు కానీ ఒక్క ఐటి కంపెనీ కూడా రాలేదు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీకి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు వచ్చేస్తున్నాయని, వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని ఇదే గుడివాడ సూటుబూటు వేసుకొని వేదికపై బల్ల గుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
మళ్ళీ ఇప్పుడు ఇన్ఫోసిస్ తెస్తున్నాము కనుక దాని వెనుకే ఐటి కంపెనీలన్నీ విశాఖకు క్యూ కడతాయని, ‘త్వరలో అంటే రాబోయే 5 ఏళ్లలో’ ఆ రాబోయే ఐటి కంపెనీలలో 2-3 లక్షల మందికి ఐటి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి గుడివాడ చెపుతున్నారు.
ఇదివరకు 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పినప్పుడు నామాము కనుక ఇప్పుడూ నమ్మాల్సిందే!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు… అలాగే పాలకుల తీరు బాగుంటే పరిశ్రమలు, ఐటి కంపెనీలు క్యూ కడతాయని పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే అర్దమవుతుంది. ఏపీలో అటువంటి మంచి వాతావరణం లేదు కనుకనే ఏపీకి రావడం లేదు. అందుకే వైసీపి ప్రభుత్వం జనాలను టైమ్ మెషీన్ ఎక్కించి భవిష్యత్ కాలంలో తీసుకువెళ్ళి అప్పుడు జరుగబోతున్నట్లు అన్నీ చూపిస్తుంటుంది. మంత్రి గుడివాడ ఈప్పుడు అదే చేస్తున్నారు.



