కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విజయ్ అనే ఓ విద్యార్ధి ఆడపిల్లల హాస్టల్ బాత్ రూమ్‌లో రహస్య కెమెరా పెట్టాడంటూ అతనిని, అతనికి సహకరిస్తున్న మరో విద్యార్ధినిని వారు పట్టుకొని చితకబాదారు. తర్వాత నిన్న అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విద్యార్ధినులు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు.
రహస్య కెమెరా పెట్టిన్నట్లు అనుమానిస్తున్న ఆ విద్యార్ధి, ఆ వీడియోలని కాలేజీలో తోటి విధ్యార్ధులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ జిల్లా మంత్రి కొల్లు రవీంద్రని, జిల్లా కలెక్టర్ డికె బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావులను అక్కడకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వారు అక్కడకు చేరుకునేసరికి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. కానీ వారు విద్యార్ధినులకు నచ్చజెప్పి శాంతింపజేసి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత వారు చూపిన బాత్రూములని నిశితంగా పరిశీలించారు. రహస్య కెమెరాలను కనిపెట్టేందుకు సాంకేతిక నైపుణ్యం కలిగిన పోలీస్ బృందాన్ని రప్పించారు. పోలీసులు సదరు విద్యార్ధి విజయ్‌ని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఆ తర్వాత విద్యార్దులందరినీ సమావేశపరిచి దీని గురించి ప్రశ్నించి వివరాలు కనుక్కోవడమే కాకుండా అటువంటి వీడియోలు ఉన్నట్లయితే మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌లను తక్షణం తమకు అప్పగించాలని, ఎవరైనా ఆ వీడియోని సర్క్యులేట్ చేసిన్నట్లు తెలిస్తే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే, వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టేసింది. ఇది రాజకీయ సమస్య కానే కాదు. కానీ వైసీపి సున్నితమైన ఈ అంశాన్ని కూడా వాడేసుకోవాలనే యావ ప్రదర్శిస్తూ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై దుష్ప్రచారం చేస్తుండటం చూస్తే వైసీపి ఇంతగా దిగజారిపోయిందా? అని అనిపించకమానదు.
—




