పవన్‌ కళ్యాణ్‌ చెవిలో జోరీగ… ఎంపీలను ఆయనే డిసైడ్ చేసేశారుగా!

Harirama Jogaiah

పొత్తులు, సీట్ల సర్దుబాట్ల గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పవన్‌ కళ్యాణ్‌ పార్టీ శ్రేణులకు లిఖిత పూర్వకంగా సున్నితంగా హెచ్చరించిన మర్నాడే, ఆయన శ్రేయోభిలాషి హరిరామ జోగయ్య పవన్‌ కళ్యాణ్‌ను మరో బహిరంగ లేఖ వ్రాశారు.

దానిలో ఆయన ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు జనసేన తరపున ఎవరిని అభ్యర్ధులుగా బరిలో దింపాలో సూచించారు. వాటిలో అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, విజయనగరం లోక్‌సభ స్థానాలకు జనసేన అభ్యర్ధులను సూచించారు. ఆ స్థానాలలో వారిని నిలబెడితే ఎన్నికలలో జనసేన తప్పకుండా గెలుస్తుందని హరిరామ జోగయ్య సూచించారు. ఆ జాబితాలో నాలుగురైదుగురు కాపు, బలిజ వర్గాలకు చెందినవారే ఉన్నారు.

ADVERTISEMENT

టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిసి పోటీ చేసేందుకు సిద్దమవుతూ, కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను అడిగింది. దానిపై టిడిపి, జనసేనలు చర్చించుకుంటున్నాయి. బీజేపీని కూడా తమతో కలుపుకుంటే రెండు పార్టీలు మరికొన్ని సీట్లు వదులుకోక తప్పదు.

అతి త్వరలో బీజేపీతో పొత్తులు, మూడు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లపై అధికారిక ప్రకటన చేసేందుకు మూడు పార్టీలు సిద్దమవుతుంటే, హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఇటువంటి సూచన లేదా సలహా ఇస్తూ లేఖ వ్రాయడం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమే.

ఇటువంటి పనులు చేసి జనసేనకు నష్టం కలిగించవద్దని పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేస్తుంటే, హరిరామ జోగయ్య సరిగ్గా అదే చేస్తున్నారు!

ఆయన పేర్కొన్న అభ్యర్ధులుకు పవన్‌ కళ్యాణ్‌ టికెట్స్ ఇవ్వకపోతే, కాపు పెద్దని గౌరవించలేదని, కాపులకు పవన్‌ కళ్యాణ్‌ అన్యాయం చేస్తున్నారని వైసీపి దుష్ప్రచారం చేయకుండా ఉండదు.

ఒకవేళ వైసీపి చేయకపోయినా హరిరామ జోగయ్య ఇటువంటి లేఖలతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నందున జనసేనకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.

జనసేన సీనియర్ నాయకుడు నాగబాబుకి అన్నీ తెలిసి ఉన్నప్పటికీ బీజేపీతో టిడిపి పొత్తులు, సీట్ల సర్దుబాట్ల గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తూ, త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా అన్నీ చెప్తారన్నారు. కానీ హరిరామ జోగయ్య జనసేన రధంలోకి ఎవరూ పిలవకుండానే వచ్చి కూర్చొని, పవన్‌ కళ్యాణ్‌కు శల్య సారధ్యం చేస్తున్నారు! ఆయన సారధ్యం ఇలాగే కొనసాగితే ఎన్నికలకు ముందే ఓటమికి సిద్దం అయిపోక తప్పదు. జనసేన గెలవాలని, అధికారంలోకి రావాలని కోరుకునే వారందరూ పవన్‌ కళ్యాణ్‌పై ఒత్తిడి చేయకుండా కాస్త ఓపిక పడితే చాలు.

ADVERTISEMENT
Latest Stories