Harish Rao Comments On Revanth Reddy

రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికి రాజకీయ నాయకులంతా పోటీపడుతుంటారు.ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయంలో ఇప్పుడిప్పుడే కాస్త వేడి రాచుకుంటుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుతుంది.

మొన్నటి దాక బిఆర్ఎస్ విలీనం మీద కాంగ్రెస్, బీజేపీ లు రాజకీయం నడిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హామీల మీద బిఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. పంద్రాగస్ట్ సవాళ్ల పర్వం ముగిసిందిలే, రాజీనామాల మీద ముఖ్యమంత్రి రేవంత్, బిఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు రాజీ పడినట్లే అనుకున్న నేపథ్యంలో హరీష్ మరో కొత్త వాదాన్ని తేర మీదకు తెచ్చారు.

Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!

ఆలయ పర్యటనలకు శ్రీకారం చుట్టిన హారిష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. హామీల అమలులో దేవుళ్ళ పై ఓట్టేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మాట తప్పారు. దేవుడి మీద ఒట్టేసి కూడా మాట నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డి చేసిన పాపానికి నేను పరిహారం చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించి అందరిని ఒక్కసారిగా కంగు తినిపించారు హరీష్.

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని సందర్శించుకున్న హరీష్ రావు రేవంత్ చేసిన పాపానికి తెలంగాణ ప్రజలను శిక్షించవద్దు, దానికి నేను పరిహారం చెల్లిస్తున్నా అంటూ ఆలయంలోని వేద పండితుల సమక్షంలో పాపపరిహార ప్రమాణం చేసారు. అయితే ఇంతకీ పాపం చేసిందెవరు? పరిహారం చేస్తుందెవరు? ప్రత్యర్థి పాపానికి హరీష్ పరిహారం ఏమిటి మరి విడ్డురంగా ఉంది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.

Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!


కాంగ్రెస్ ప్రభుత్వమేమో రుణమాఫీ అమలు చేసేసాం రైతులకిచ్చిన మాట నిలుపుకున్నాం అంటూ ప్రచారం చేసుకుంటుంటే హరీష్ రావు మాత్రం రేవంత్ మాట తప్పి పాపం చేసారు అంటూ దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఒకరు చేసిన పాపం మరొకరు కడిగితే పోతుందా? ఇదెక్కడి లాజిక్ స్వామి? హరీష్ రావు రాజకీయాలకు విరామం పలికి జ్యోతిష్కుడిలా మారారా అంటూ కాంగ్రెస్ శ్రేణుల నుండి సెటైర్లు పడుతున్నాయి.