తెలంగాణ అంతటా నీళ్ళే… దాచుకోలేరు, వాడుకోలేరు…

Telangana heavy rains

తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీళ్ళు నదుల్లా ప్రవహిస్తున్నాయి. కనుక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు తప్పడం లేదు. కనుక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇక తెలంగాణలో పలు జిల్లాలలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వాగులు, వంకలు, నదులు, ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

కేవలం 10-15 రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ వరుసగా రెండోసారి నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. తెలంగాణలో మిగిలిన రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కనుక అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కేసీఆర్‌ ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు క్రుంగిపోయిన సంగతి తెలిసిందే. కనుక దానిలో నీటిని నిలువ చేస్తే బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోతుందని, దిగువన 40-50 గ్రామాలు నీట మునుగుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు. అందుకే దానిలోకి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు.

అంటే గట్టిగా వర్షాలు పడితే తెలంగాణలో నీటిని నిలువ చేసుకోవడం అసాధ్యం. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలు నీట మునుగుతాయి. కనుక తప్పనిసరిగా గేట్లు ఎత్తి నీటిని దిగువన ఆంధ్రాకు విడుదల చేయక తప్పదన్న మాట!

ఆ నీటిని సిఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించాలనుకుంటే, తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ బీఆర్ఎస్‌ పార్టీ ఎంతగా గొడవ పెట్టిందో అందరూ చూశారు. ఇంకా కాగితాల మీద ఉన్న బనకచర్ల పేరుతొ చంద్రబాబు నాయుడుని ఎంతఃగా విమర్శించిందో అందరూ విన్నారు.

“ఏటా ఇన్ని నీళ్ళు సముద్రంలో వృధాగా కలిసిపోతే మీకు ఏం లాభం? ఆ నీటిని మేము నీటి కోసం అల్లాడుతున్న మా రాయలసీమ జిల్లాలకు వాడుకుంటే మీకేంటి నష్టం? ఏవిదంగా నష్టం?” చెప్పాలని సిఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే, హరీష్ రావు సూటిగా సమాధానం చెప్పనేలేదు.

ఎంతసేపు బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరిగిపోతుందని తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతుంటారే తప్ప ఏవిదంగా నష్టమో వివరించరు!

నదీ జలాల వినియోగించుకోవడం గురించి మాట్లాడమంటే, చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారంటూ బీఆర్ఎస్‌ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుంటారు.

ఇంత నీరు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటే ఆపసోపాలు పడుతూ, కళ్ళ ముందు ప్రవహిస్తున్న ఇంత నీటిని దాచుకోలేక, వాడుకోలేక దిగువకు వదిలేస్తూ మళ్ళీ ఈ నీళ్ళ రాజకీయాలు అవసరమా బీఆర్ఎస్‌ పార్టీకి?

ADVERTISEMENT
Latest Stories