సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమా విడుదలను నిలుపుదల చేసేందుకు ‘లింగా’ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేకపోయాయి. ఈ సమయంలో సినిమా విడుదలపై స్టే విధించేందుకు మద్రాస్ హైకోర్ట్ తాజాగా కూడా నిరాకరిస్తూ… ‘కబాలి’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మూడు సార్లు ‘కబాలి’ సినిమాను ఆపాలని జరిగిన ప్రయత్నాలు విఫల యత్నాలుగా మిగిలిపోవడం కొసమెరుపు.
తొలుత ‘లింగా’ సినిమా పంపిణీ దారులు వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండానే కొట్టివేసిన హైకోర్టు, తాజాగా బుధవారం నాడు దాఖలైన రెండు పిటిషన్లలో ఒక దానిని బుధవారమే తోసిపుచ్చింది. బ్లాక్ టికెట్ల వివాదం నేపధ్యంలో చిత్ర విడుదలను వాయిదా వేయాలన్న పిటిషన్ ను అప్పటికప్పుడే తోసిపుచ్చిన హైకోర్టు, ‘లింగా’ సినిమాకు వచ్చిన నష్టాలను భర్తీ చేస్తామన్న హామీని మరచిన హీరో రజనీ, నిర్మాత కలైపులి థానులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ కు అనుకూలంగా నోటీసులు జారీ చేసింది.
అయితే నేడు మలి విచారణ చేసిన మద్రాస్ హైకోర్ట్, సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపధ్యంలో, చివరి క్షణంలో ‘కబాలి’ విడుదలపై స్టే విధించలేమని స్పష్టంగా తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటివరకు సూపర్ స్టార్ అభిమానుల మదిలో నెలకొని ఉన్న సందేహాలు పటాపంచలు అవుతూ, ప్రేక్షకులను సందడి చేయడానికి ‘కబాలి’ అనుకున్న సమయానికే రానున్నాడు. ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్స్ లో సంచలనం రేపిన ‘కబాలి’ తొలి టాక్ పాజిటివ్ గా వస్తే… బాక్సాఫీస్ రికార్డులు కనుమరుగు కావడం తధ్యం అంటున్నారు ట్రేడ్ పండితులు.



