హిందుత్వం మతం మాత్రమే కాదు… ఓ జీవన విధానం!

Hindutva life philosophy

బహుశః ప్రపంచంలో మరే మతంలో కూడా హిందూమతంలో ఉన్నంత స్వేచ్చ, భిన్నత్వం, పరమత సహనం ఉండదేమో?

అందుకే హిందువులతో సహా అన్ని మతాలవారు హిందూమతం, సంస్కృతి, ఆలయాలు, దేవుళ్ళు, పూజలు, పండుగలు… ఇలా హిందూమతానికి సంబందించిన ప్రతీ అంశంపై స్వేచ్చగా, నోటికొచ్చిన్నట్లు మాట్లాడగలుగుతున్నారు. సినిమాలు, కార్టూన్లు, వెకిలి చేష్టలు కూడా చేయగలుగుతున్నారు.

ADVERTISEMENT

అయితే అనంత విశ్వమంత గొప్పది హిందూమతం. కనుకనే యుగయుగాలుగా అలాగే నిలిచి ఉంది. ఎవరు ఎన్ని దాడులు చేసినా, మత మార్పిడులు చేసినా, ఆలయాలను ధ్వంసం చేసినా నేటికీ బలంగా నిలిచి ఉంది.

ఎందువల్లనంటే చాలా మంది, ముఖ్యంగా అన్య మతస్తులు అనుకొంటున్నట్లు హిందూమతం ఆలయాలలో లేదా పురాణాలలో బందించబడి లేదు. అది కోట్లాది ప్రజల మనసులలో ఉంది.

చాలా మంది హిందూమతం కూడా ఇతర మతాలలాగే ఓ మతమని అనుకుంటారు. కానీ అదొక జీవన విధానం. హిందూమతం కేవలం మనుషులను సక్రమ మార్గంలో నడిపించేది మాత్రమే కాదు. ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతీజీవి, ప్రాణం లేని ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెపుతుంది.

పరమేశ్వరుడి మెడలో విషసర్పం… ఆ పాముకి శత్రువు కుమారస్వామి వాహనమైన నెమలి… ఆ పాముకి ఆహారమైన ఎలుక వినాయకుడి వాహనం.

ఆ వినాయకుడికి ఏనుగు తల… శివుడి వాహనం నందీశ్వరుడు… పార్వతీదేవి వాహనం పులి… ఈ చిన్న ఉదాహరణ ఈ సృష్టిలో సకల జీవులకు సమప్రాధాన్యం ఉందని హిందూమతం చెపుతోంది కదా?

మనుషులకు, పశుపక్ష్యాధులకు, కీటకాలకు పచ్చటి చెట్లు చాలా అవసరం. అందుకే రావిచెట్టు, వేపచెట్టు, మర్రి చెట్టు ఇలా ఒక్కో చెట్టుకి దైవత్వం ఆపాదించి కాపాడుతోంది హిందూమతమే కదా? చివరికి సూర్యచంద్రులు, నవ గ్రహాలను కూడా హిందూమతం దైవాలుగానే పేర్కొంది. అంటే ఈ విశాల విశ్వమంత విశాలమైనది హిందూమతం అని అర్ధమవుతోంది కదా?

ఇలా… హిందూమతాన్ని ఎన్ని కోణాలలో నుంచి అయినా చూడవచ్చు. నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ రంగులోకి మారినట్లుగానే హిందూమతంలో మనం మంచిని చూడాలనుకుంటే మంచే కనిపిస్తుంది… చెడు దృష్టితో చూస్తే చెడుగానే కనిపిస్తుంది.

హిందూమతం ఇంత విస్తారమైనది కనుకనే యుగయుగాలుగా అనేకమంది ఋషులు, పండితులు, స్వామీజీలు, కవులు, రచయితలు, సామాన్య ప్రజలు ఎవరి అవగాహన స్థాయిని బట్టి వారు దానిని నిర్వచించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అర్ధం చేసుకొని ఆచరించేవారు ఆచరిస్తూనే ఉన్నారు. అర్ధం కానివారు అవహేళన చేస్తూనే ఉన్నారు.

కానీ అంత మాత్రన్న హిందూమతం గొప్పదనం తగ్గిపోదు. దీనిని ఆచరించకపోయినా పర్వాలేదు కానీ ఇదొక గొప్ప జీవన విధానమని గ్రహిస్తే అంతే చాలు. హిందూమత సారాంశం ఒక్కటే… జీవితం, ప్రకృతి, సమాజం అన్నింటినీ సమతుల్యంగా కాపాడుకుంటూ సకల ప్రాణులు సుఖసంతోషాలతో జీవించమని.

ADVERTISEMENT
Latest Stories