పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపితో పొత్తు ఖరారు చేసుకొని ఎన్నికలలో పోటీ చేసేవరకు ఎన్ని అవమానాలు భరించారో అందరికీ తెలుసు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తాను గెలిచి, తనని నమ్ముకున్నవారిని గెలిపించుకున్నారు. నేడు ఈ స్థాయిలో ఉన్నారు.
ఇది వరకు చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై కత్తులు దూసినవారే. అందుకు భారీ మూల్యం చెల్లించారు కూడా. కనుక ఓ మెట్టు దిగి మోడీతో మళ్ళీ స్నేహం కుదుర్చుకున్నారు. తర్వాత ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు.
సుంకాల పేరుతో ట్రంప్ భారత్ చెయ్యి మెలిపెడుతుంటే మొదట భీష్మించుకు కూర్చున్న ప్రధాని మోడీ, భారత్ మార్కెట్లకు, 150 కోట్ల జనాభాకు ‘జీఎస్టీ లేపనం’ పూస్తే సరిపోతుందనుకున్నారు. కానీ కుదరదని గ్రహించాక ట్రంప్‌తో రాజీకి సిద్దమయ్యారు.
ఈ ముగ్గురి నిర్ణయాలు గొప్ప విషయమని చెప్పలేము కానీ ఖచ్చితంగా విజ్ఞత అని చెప్పవచ్చు. లోకరీతి ఇదే.
కానీ అహంకారంతో కేసీఆర్, అతిశయంతో జగన్ ఇద్దరూ బలవంతులైన శత్రువులను తక్కువగా అంచనా వేసి ఎదురెళ్ళి బోర్లా పడ్డారు.
ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముగ్గురూ కూడా ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినవారు. కనుక తగ్గి నెగ్గుతున్నారు.
కానీ ఎక్కడ తగ్గాలో తెలిసి ఉన్నా అహం అడ్డుపడినందున జగన్, కేసీఆర్ ఇద్దరూ ఊబిలో పడ్డారు. తమని నమ్ముకున్నవారందరినీ కూడా ఆ ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు.
సరే! పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారంతో తప్పులు చేయడం సహజం. కానీ ఓడిపోయి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితిలో అధినేతలు, దయనీయస్థితిలో పార్టీ ఉన్నప్పుడైనా మేల్కొన్నారా? అంటే లేదని బయట వాళ్ళే కాదు… కల్వకుంట్ల కుటుంబంలోని కవిత చెపుతున్నారు కదా?జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఇందుకు తాజా నిదర్శనమే కదా?
పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాకుండా కేసీఆర్, ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాడుకుంటూ కేటీఆర్, మోసగాడు, అవినీతిపరుడని కవిత ఆరోపిస్తున్నా సమాధానం చెప్పకుండా హరీష్ రావు ముగ్గురూ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఎటు తీసుకుపోతున్నారో వారికే తెలియాలి.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అహం, అతిశయం కారణంగానే వాస్తవ రాజకీయ పరిస్థితులను గుర్తించలేకపోతున్నారు లేదా గుర్తించినా వాస్తవాలు అంగీకరించలేక భ్రమలో ఉండిపోతున్నారు.
ఆ భ్రమ వల్లనే ‘మళ్ళీ మనమే’ అనే మరో భ్రమలో ఉంటున్నారు. డిజిటల్ డెయిరీ చూపిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలని కూడా నమ్మింఛి తప్పు దారిలో నడిపిస్తున్నారు. వారు కూడా అయన మాటలను గుడ్డిగా నమ్ముతుండటం విచిత్రం. ఆయనపై వారికి అంత అచంచలమైన విశ్వాసం ఉండటం ఆయన అదృష్టమే అని చెప్పాలి.
కానీ ‘రాజకీయాలు చేయడం ఇలాగే అనుకుంటూ అందరూ తప్పుమీద తప్పు చేస్తూ అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నారు. కనుక వారి రాజకీయ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో ఊహించవచ్చు.






