రాజకీయాలు విధానాలు, సిద్ధాంతాలు ఆధారంగా జరగాలి. వాటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ఆ లెక్కనే సాగాలి… అని అంటే చిన్న పిల్లాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్లనిపిస్తే తప్పు కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మన సమాజపు ఆలోచనాధోరణి సమూలంగా మార్చేశాయి కనుక!
పార్టీల మద్య వర్గాలుగా చీలిపోయిన ప్రజలు వాటి దృష్టి కోణంలో నుంచే అన్నీ చూస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఓట్లు కూడా వేస్తున్నారు.
రాజకీయ నాయకులు ప్రతీ వ్యవస్థని ప్రభావితం చేస్తున్నారు. బెదిరిస్తున్నారు కూడా. ఇదెలా సాధ్యమైంది? అంటే ‘మందబలం’తోనే అంటే చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది వాస్తవమని అందరికీ తెలుసు.
ఒక వ్యక్తి ప్రజాసేవ లేదా మరో కారణంతోనో పార్టీ స్థాపించాక, వివిధ అవసరాలు, కారణాలు, లెక్కలతో పలువురు ఆ పార్టీలో చేరుతారు.
పార్టీలో చేరగానే వారికి సమాజంలో గుర్తింపు రాదు. కనుక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. కొందరు అనుచరులను పోషిస్తూ వెంట తిప్పుకుంటారు. ఎందుకంటే, ఆ మాత్రం ఆర్భాటం ఉంటే తప్ప ప్రజలలో గుర్తింపు లభించదనే భావనతోనే.
ప్రజలు కూడా అలా తిరిగేవారినే పట్టించుకుంటారు. ఉదాహరణకు మాజీ పౌరవిమాన మంత్రి అశోక్ గజపతి రాజుకి ఇలాంటి అలవాటు లేదు. కనుక గత ఏడాది ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో కుటుంబంతో కలిసి ప్లాట్ ఫారం మీద రైలు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా ఆయనని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోవాలని ఆయన కోరుకోరు కూడా.
కానీ రాజకీయ నాయకులు అందరూ ఆయనలా నిరాడంబరంగా ఉండాలనుకోరు. కనుక మందిమార్భలంతోనే తిరుగుతుంటారు. అలాంటి నాయకులు, వారి అనుచరులతో పార్టీ నిండినప్పుడు అది మందబలం అవుతుంది. ఆ మంద బలం పెరుగుతున్న కొద్దీ వారు సమాజాన్ని, వ్యవస్థలను శాశించ గలుగుతుంటారు.
నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రులను దూషిస్తున్న రాజకీయ నాయకులని అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం, పోలీసులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పదు.
అవినీతి కేసులో ఓ నాయకుడిని సిట్ విచారించాలన్నా ఆలోచించుకోక తప్పదు. ఎందుకంటే వారి చుట్టూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో దుర్బేధ్యమైన రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటారు. వారిని చేదించుకొని వెళ్ళాలంటే పోలీసులు కూడా యుద్ధానికి బయలుదేరినట్లు సన్నాహాలు చేసుకొని వెళ్ళాలి.
ఒకవేళ విచారించినా, అరెస్ట్ చేసినా ఆ తర్వాత ఆయా పార్టీలు సృష్టించే అల్లకల్లోల్లం అంతా ఇంకా కాదు. దీనికి కారణం మంద బలమే… అంటే కాదనగలమా?
ఈ మంద బలంతోసమాజాన్ని, వ్యవస్థలను ధిక్కరిస్తున్నవారికి, ప్రజలు కూడా కులం, మతం, ప్రాంతీయత వంటి కారణాలతో తోడైతే? సమాజం అల్లకల్లోలం అవుతుంది.
ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు యూపీ, బిహార్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. ఆ రెండు రాష్ట్రాల కంటే వేగంగా మన తెలుగు రాష్ట్రాలలోనే ఈ అరాచక ధోరణులు ప్రభలుతున్నాయి. కనుక ప్రజలు మేల్కోవల్సిందే… కానీ మన రాజకీయ నాయకులు చెపుతున్నట్లు కాదు.






