ఉత్తరాదిన ముంబైలో వినాయకచవితి వేడుకలను ఎంత భారీగా జరుపుకుంటారో, అంతకు మించిన రెట్టింపు స్థాయిలో భాగ్యనగరం వినాయకుడి పందిళ్ళతో కళకళలాడుతుంది. నవరాత్రులు జరిపే వినాయకుని వేడుకలు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో జరిగే నిమజ్జన వేడుకలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. అయితే ఈ సారి అలాంటి హంగామాకు తెలంగాణా సర్కార్ ‘నో’ చెప్తోంది.
ఇప్పటికే వినాయకుని విగ్రహాల ఎత్తు మీద ఒక నిబంధన ప్రకటించగా, తాజాగా వినాయక నిమజ్జనంకు సంబంధించి కూడా కేసీఆర్ సర్కార్ హైకోర్టుకు విన్నవించుకుంది. ఈ ఏడాది వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ జలాశయంలో ఉండబోదని, విగ్రహాలన్నీ ప్రత్యేకమైన చెరువుల్లో మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయాలను గుర్తించామని, పూర్వం మాదిరి అంతా హుస్సేన్ సాగర్ కాకుండా, ఏ ప్రాంతాలలో ఉండే విగ్రహాలను సంబంధిత ప్రాంతాలకే పరిమితం చేస్తూ ప్రత్యేక చెరువులను గుర్తించామని చెప్పుకొచ్చింది.
వినాయక విగ్రహాల నిమజ్జనంపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సదరు విషయాలను ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అలాగే నిమజ్జనం పూర్తయిన తర్వాత వ్యర్ధాల తొలగింపును శరవేగంగా పూర్తి చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. అయితే దీనిపై తెలంగాణా సర్కార్ చేసిన ఈ ప్రతిపాదనలపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
వినాయక ఉత్సవం అంటే ప్రజలకు పెద్ద పండగ అని, అలాంటి నిమజ్జన ప్రక్రియను హుస్సేన్ సాగర్ నుండి కాక, సాధారణ చెరువుల్లో నిమజ్జనం చేయడం అంటే పండగ శోభను తగ్గించడమేనని కొందరు అభిప్రాయ పడుతుండగా, పండగ పేరుతో విగ్రహాలను నిమజ్జనం చేస్తూ హుస్సేన్ సాగర్ నీటిని కలుషితం చేస్తున్నారని, దానిని నియత్రించేందుకు గానూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అంతిమంగా హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అన్న ఆసక్తి నగరవాసుల్లో నెలకొని ఉంది.



