రాష్ట్రాల అభివృద్ధికి అనేక కొలమానాలు ఉంటాయి. వాటిలో భూముల ధరలు కూడా ఒకటి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న 40, 70 అంతస్తుల భవనాలు, విలాసవంతమైన గేటడ్ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి.
ఇవి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెండుతోందో సూచిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా భారీగా పెరగడంతో నగరంలోని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ వేలం పాటలలో పోటా పోటీగా పాల్గొంటున్నాయి.
తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టిజిఐఐసి 5.38 ఎకరాల భూమిని ఈ-వేలం వేసింది. వేలంలో కనీస ధరే రూ.175 కోట్లుగా నిర్ణయించడం విశేషం. అయితే ఆ ధర చూసి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమాత్రం భయపడలేదు. వెనక్కు తగ్గలేదు.
వేలంపాటలో పోటాపోటీగా పాల్గొన్నాయి. వంశీ రామ్ బిల్డర్స్ అనే సంస్థ ఎకరం రూ.269 కోట్లకు దక్కించుకుంది!
వారం రోజుల క్రితమే రాయదుర్గంలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు రూ.269 కోట్లకు అమ్ముడైంది.
ఈ వేలంపాటలో 5.38 ఎకరాలకు మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు రాయదుర్గం భూముల వేలంపాటతో ప్రభుత్వానికి రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్‌లో భూముల ధరలు ఈ స్థాయికి పెరిగిపోతున్నందున, ఇక సామాన్యుల సొంత ఇంటి కల పగటికలగానే మిగిలిపోవచ్చు. అది వేరే విషయం.
కానీ రాష్ట్రం, నగరాలు, పట్టణాలు, పల్లెలు సమాంతరంగా అభివృద్ధి చెందుతుంటేనే భూముల ధరలు ఈ స్థాయిలో పెరుగుతుంటాయని రాయదుర్గం వేలంపాటతో మరోసారి స్పష్టమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. భారీ పెట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తున్నాయి. పోలవరం, వెలిగొండ వంటి అనేక భారీ ప్రాజెక్టులు చకచకా పూర్తవుతున్నాయి. కనుక భవిష్యత్‌లో ఆంధ్రాలో భూముల ధరలు కూడా హైదరాబాద్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా మరో మూడేళ్ళలో రాజధాని అమరావతి, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు వాటి చుట్టుపక్కల జిల్లాలలో భూముల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. కనుక స్తోమతు ఉన్నవారు ఇప్పుడే కొనుక్కోవడం, ఇప్పటికే భూములున్నవారు అవి కబ్జా కాకుండా కాపాడుకోవడం మంచిది.





